Guntur: యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డేగల ప్రభాకర్
Guntur: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు "వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్" లక్ష్యంతో ముందుకెళ్తామని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ స్పష్టం చేశారు.
Guntur: యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డేగల ప్రభాకర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APIDC) చైర్మన్ డేగల ప్రభాకర్ అధ్యక్షతన నేడు కార్పొరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు నుంచి చైర్మన్ డేగల ప్రభాకర్ వర్చువల్ ( ఆన్లైన్) ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్పొరేషన్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సమీక్షించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్పొరేషన్ అభివృద్ధి, కార్యకలాపాల వేగవంతం, పరిపాలనా సామర్థ్యం పెంపొందించే దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” అనే లక్ష్యంతో కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి, వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ సొంతంగా పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి, ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో కార్పొరేషన్ బోర్డు కార్యవర్గ సభ్యులు, మేనేజింగ్ డైరెక్టర్ (MD), వివిధ హోదాల్లోని అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.




