Tenali: తెనాలిలో మత వేడుకల్లో 16 మంది అస్వస్థత.. అధికారుల పరిశీలన!
Tenali: తెనాలిలో మత వేడుకల అనంతరం 16 మంది అస్వస్థత. జైన్ టెంపుల్, ప్రైవేట్ ఆస్పత్రిని పరిశీలించిన ఆర్డీవో రమణి, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి.. ఉపవాసం, ఎండ వల్లేనని స్పష్టత.
Tenali: తెనాలిలో మత వేడుకల్లో 16 మంది అస్వస్థత.. అధికారుల పరిశీలన!
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి, పట్టణంలో ఆదివారం జరిగిన ఓ మత వేడుకలో పాల్గొన్న కొందరు అస్వస్థతకు గురైన ఘటనపై సోమవారం అధికారులు పరిశీలన చేపట్టారు.వేడుకల్లో భాగంగా బుర్రిపాలెం రోడ్డులోని గోశాలను సందర్శించి తిరిగి వచ్చిన అనంతరం కొందరికి వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం వెలువడింది.
ఈ నేపథ్యంలో ఆర్డీవో శ్రీ రమణి, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి సంబంధిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. జైన్ టెంపుల్, ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అస్వస్థతకు గురైన వారి వివరాలను సేకరిస్తున్నారు.అయితే ఎక్కువ సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైనట్లు వచ్చిన సమాచారంలో వాస్తవం లేదని అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా ఉపవాసం ఉండటం, మరోవైపు ఎండ తీవ్రత కారణంగానే కొందరు అస్వస్థతకు గురయ్యారని స్పష్టం చేశారు. మొత్తం 16 మంది మాత్రమే అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పరిశీలనలో తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు, డిప్యూటీ డీఎంహెచ్‌వో అన్నపూర్ణ, కొల్లిపర తహసీల్దార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు.




