Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీల స్వీకరణ.. భూ అక్రమాలపై బాధితుల ఆవేదన!
Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
Mangalagiri: టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీల స్వీకరణ.. భూ అక్రమాలపై బాధితుల ఆవేదన!
మంగళగిరి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన కోట ప్రసాద్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిలో సుమారు 30 నుండి 32 సెంట్ల భూమిని గండి నాగ సత్య భాస్కరరావు, గండి చంద్రశేఖరరావు అనే సోదరులు అక్రమంగా తమ భూమిలో కలిపేసుకున్నారు.
2023లో గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వే నెపంతో మండల రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి, అసలు రీ-సర్వే అధికారి సంతకం లేకుండానే అనధికారిక పద్ధతుల్లో ఈ మార్పులు చేయించారు. రికార్డులను ఫోర్జరీ చేసి తమ పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు.
పొలానికి వెళ్లేందుకు దశాబ్దాలుగా ఉన్న 10 అడుగుల ఉమ్మడి ‘బండి బాట’ను సైతం రెవెన్యూ అధికారుల సహకారంతో తమ సొంత భూమిగా మార్చుకొని రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డేగల ప్రభాకర్ కు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.
పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామానికి చెందిన పి. లింగమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలోని సర్వే నెం. 489-5-ఎ3లో గల 4.26 ఎకరాల భూమి తమ తాతగారైన దివంగత పెద్ద కోటయ్య స్వార్జితం. పెద్ద కోటయ్య తదనంతరం ఆయన కుమారులు (పెద్ద అప్పయ్య, వెంకట రామయ్య, వెంకట గురవయ్య), ప్రస్తుతం మూడో, నాలుగో తరాల వారసులు దాదాపు 80 ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం.
ఈ భూమికి సంబంధించి రిజిస్టర్డ్ దస్తావేజులు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఈసీ, ఆర్‌ఓఆర్, గత కంప్యూటర్ అడంగల్ రికార్డులు, శిస్తు రసీదులతో పాటు బ్యాంక్ పంట రుణాలు పొందిన ఆధారాలన్నీ పూర్తి చట్టబద్ధంగా ఉన్నాయి. గత రెండేళ్లుగా గురజాల తహసీల్దార్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నోటీసులు, ఎంక్వైరీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.
ఆర్డీవో ఆదేశాలు ఉన్నప్పటికీ, తహసీల్దార్ రాజకీయ ప్రలోభాలకు లొంగి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆన్‌లైన్ వెబ్‌ల్యాండ్ (అడంగల్) నుంచి సదరు 4.26 ఎకరాల వివరాలను ఏకపక్షంగా తొలగించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన చింతా డేవిడ్ రాజారత్నం గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..1950వ సంవత్సరం నుంచే చట్టబద్ధమైన దస్తావేజులతో కూడిన పూర్వీకుల ఇళ్లు, వ్యవసాయ పొలాలు, ఖాళీ స్థలాలు స్వాధీనంలో ఉన్నాయి.
సదరు ఆస్తులు వారివి కావంటూ, అందులోని ఒక స్థలంలో ఉన్న చర్చిని తొలగించాలంటూ జిల్లా కలెక్టరేట్ ద్వారా నోటీసులు పంపించారు. ఇవి ప్రైవేటు ఆస్తులేనని నిర్ధారిస్తూ సర్వేయర్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికే స్పష్టమైన నివేదికలు ఇచ్చినప్పటికీ, కలెక్టరేట్ అధికారులు తమ తప్పిదాన్ని సరిదిద్దుకోకుండా నిర్లక్ష్యంగా, వెటకారంగా వ్యవహరిస్తున్నారు.
కక్షపూరితంగా తనపై బలవంతపు మతమార్పిడి వంటి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని, అధికారుల వేధింపుల కారణంగా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయి కుటుంబం రోడ్డున పడే దుస్థితి వచ్చింది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన బోడపాటి చంద్రమౌళి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 115/3 లో తన భార్య అయిన బోడపాటి రమాదేవి పేరు మీద గతంలో రికార్డులలో 3.39 ఎకరాలు నమోదై ఉంది. సదరు భూమిని 11-04-1997న వినుకొండ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నెం. 1124/97 ద్వారా వాకిరెడ్డి పిచ్చమ్మ వద్ద నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశాం.
ఇటీవల నిర్వహించిన రీ-సర్వేలో పూర్తి విస్తీర్ణం 3.39 ఎకరాలకు బదులుగా కేవలం 3.18 ఎకరాలకు మాత్రమే ఎల్పీ నెంబర్ కేటాయించి, ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు చేశారు. దీనివల్ల సుమారు 21 సెంట్ల భూమి రికార్డుల్లో తగ్గిపోయింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దాలని కోరుతూ వీఆర్వో, సర్వేయర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, "మీ భూమి అంతే ఉంది" అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన జయదుర్గాబాయి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. నగరంలోని కె.ఎల్.రావు నగర్‌లో సుమారు 40 ఏళ్ల క్రితం తమ తాతగారైన బొందిలి నందగోపాల్ సింగ్ శ్రీ జంబులాంబ దేవి ఆలయాన్ని స్థాపించి పూజాదికాలు నిర్వహించేవారు. ఆయన తర్వాత తన తండ్రి దూబే ఈశ్వర్ ప్రసాద్, ఆయన మరణానంతరం తాను, తన తల్లి జమునాబాయి కలిసి గత రెండు దశాబ్దాలుగా ఆలయ నిర్వహణ, దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నాం.
ఆలయాన్ని హస్తగతం చేసుకోవాలనే దురుద్దేశంతో స్థానికులైన బొందిలి ప్రవీణ్ సింగ్, బొందిలి జగన్నాధ్ సింగ్, బొందిలి నాగమణిబాయి, బొందిలి జయలక్ష్మీబాయి, బొందిలి జ్యోతి తదితరులు గత కొన్నేళ్లుగా ముఖ్యంగా దసరా ఉత్సవాల సమయంలో గొడవలు చేస్తూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
ఈ ఏడాది దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టగా, ఓర్వలేని సదరు వ్యక్తులు దాడులకు తెగబడుతున్నారు. తాను దివ్యాంగురాలు కావడం, తల్లి వృద్ధాప్యంతో పాటు అనారోగ్యంతో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని తమని ఆలయం నుంచి గెంటివేయాలని, ప్రాణాలతో మట్టుబెట్టాలని బెదిరిస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామానికి చెందిన గీత గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. రేణిగుంట - కడప నాలుగు వరుసల జాతీయ రహదారి (NH-716) విస్తరణ పనుల్లో భాగంగా తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 185 లో తాము నివసిస్తున్న నివాస గృహాలు పూర్తిగా తొలగింపునకు గురయ్యాయి. పంచాయతీ పరిధిలోని అన్ని సర్వే నెంబర్లకు ఒకేసారి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి, ఒకే మార్కెట్ విలువను ఖరారు చేస్తూ అవార్డు పాస్ చేశారు.
ఇళ్లకు సంబంధించిన అన్ని పత్రాలు, రికార్డులు సక్రమంగా ఉన్నప్పటికీ అధికారుల తీరులో తీవ్ర వ్యత్యాసం కనిపించింది. రెవెన్యూ, కలెక్టరేట్ ఎల్.ఏ విభాగం అధికారులకు అడిగినంత కమిషన్ ముట్టజెప్పలేదన్న ఏకైక కారణంతో అధికారులు కక్షగట్టారు. 2023లో పరిహారం తీసుకున్న వారికంటే, ఆ తర్వాత తీసుకున్న తమకు అధికారులు దాదాపు 30% నుండి 40% వరకు పరిహారంలో కోత విధించి తీవ్ర అన్యాయం చేశారు. అదే ప్రాంతంలో ఇతరులకు ఎక్కువ ఇచ్చి, తమకు మాత్రం తక్కువ ఇచ్చి అన్యాయం చేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.




