Guntur: సెల్‌ఫోన్ గేమ్స్‌కు దూరంగా ఉండండి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి!
Guntur: విద్యార్థులు సెల్‌ఫోన్ గేమ్స్‌కు దూరంగా ఉండి, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం పిలుపునిచ్చారు.
Guntur: సెల్‌ఫోన్ గేమ్స్‌కు దూరంగా ఉండండి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి!
Guntur: విద్యార్ధులు సెల్‌ఫోన్ గేమ్స్‌కు దూరంగా ఉండి, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం బాలల దినోత్సవం మరియు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గుంటూరు అరండల్ పేట 5/3లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలుత గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యే గళ్ళా మాధవి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి రోజు ఉదయం నిద్రలేవగానే, రాత్రి నిద్రపోయే ముందు "డోంట్ ఇన్సల్ట్ యువర్సెల్ఫ్ - డోంట్ ఇన్సల్ట్ అదర్స్" (మిమ్మల్ని మీరు అవమానించుకోవద్దు - ఇతరులను అవమానించవద్దు) అనే రెండు వాక్యాలను ఒక మంత్రంలా జపించాలని విద్యారులకు సూచించారు.
ఇతరులతో పోల్చుకుని తక్కువ అంచనా వేసుకోవద్దని, తోటి విద్యార్థులను కూడా ఏ విషయంలోనూ కించపరచవద్దని, వచ్చే బాలల దినోత్సవం వరకు ఈ నియమాన్ని పాటిస్తే ప్రతి ఒక్కరూ చదువులో రాణిస్తారని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పిల్లలు సెల్‌ఫోన్ గేమ్స్‌కు బానిసలవుతుండటం పై ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఫోన్లలో గేమ్స్ ఆడటం వల్ల శారీరక బలహీనతతో పాటు మానసిక ఎదుగుదల దెబ్బతింటుందని హెచ్చరించారు.
సెల్‌ఫోన్ గేమ్స్‌కు పూర్తిగా 'నో' చెప్పి, సాయంత్రం వేళల్లో మైదానాల్లో ఆడుకోవడం వల్ల శరీరం దృఢంగా, చురుగ్గా మారుతుందని తెలిపారు. ఆదివారాలు, సెలవు దినాల్లో విద్యార్థులు తప్పనిసరిగా గ్రంథాలయాలకు రావాలని, పుస్తక పఠనం వల్ల మేధాశక్తి, ఆలోచనా విధానం పెరగడంతో పాటు కళ్లకు, మెదడుకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
వారోత్సవాల సందర్భంగా నిర్వహించే పోటీలలో పాల్గొనే విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ, ప్రతిభ కనబరిచిన తోటి వారిని మనస్ఫూర్తిగా అభినందించే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
విద్యార్థులలో వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా డ్రాయింగ్ తదితర పోటీలను 'థీమ్ బేస్డ్'గా నిర్వహించాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనా దేవి మరియు సిబ్బందికి సూచించిన ఎమ్మెల్యే, వారోత్సవాలను తూతూమంత్రంగా కాకుండా ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తూ చుట్టుపక్కల పాఠశాలల విద్యార్థులను భాగస్వాములను చేస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గ్రంథాలయ అభివృద్ధికి ఆర్థిక సహాయం, చేయూతనిస్తున్న దాతలకు, పెద్దలకు ఈ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.




