Guntur: గుంటూరు, తెనాలిలో మున్సిపల్ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని, నవంబర్ 1న పోలింగ్, నవంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 30 Oct 2026 4:18 PM IST
Guntur
X

Guntur: గుంటూరు, తెనాలిలో మున్సిపల్ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి మున్సిపాలిటీలకు నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు తదితర అంశాలను వెల్లడించారు.

పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 596 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 4,514 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 185 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 1,185 మంది సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 781 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అక్టోబర్ 31న ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుంటూరులో 76 వార్డులు, తెనాలిలో 52 వార్డులు కలిపి మొత్తం 128 వార్డులు ఉండగా, తెనాలిలో ఒక వార్డు ఏకగ్రీవమైనందున మిగిలిన 127 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.

7.75 లక్షల మందికి పైగా ఓటర్లు

గుంటూరు నగరపాలక సంస్థలో 6,18,714 మంది, తెనాలి మున్సిపాలిటీలో 1,57,089 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ గుంటూరులో 70 శాతం, తెనాలిలో 87 శాతం పూర్తయిందని, మిగిలిన పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లుగా తెలిపారు.

నవంబర్ 3న మున్సిపల్ ఓట్ల లెక్కింపు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గుంటూరు ఎన్నికల కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెనాలి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కోసం వి.ఎస్.ఆర్. కళాశాలలో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

పరిషత్ ఎన్నికలకు మారిన పోలింగ్ తేదీలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 5వ తేదీకి మార్చినట్లు కలెక్టర్ తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 200 ఎంపీటీసీ స్థానాలు, 13 జెడ్పీటీసీ స్థానాలు, 13 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఉన్నాయని వివరించారు. నామినేషన్ల ప్రక్రియలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు.

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అక్టోబర్ 30, 31 తేదీల్లో అన్ని మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

పటిష్ట భద్రతా చర్యలు

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల భద్రత కోసం సుమారు 1,200 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమిస్తున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలం

గుంటూరు, తెనాలి ప్రజలందరూ ఎన్నికల్లో చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు.

ఈ సమావేశం లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN