Guntur: గుంటూరు పశ్చిమంలో రూ.450 కోట్లతో ప్రగతి పరుగులు!

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు. 5 డివిజన్లలో ఎన్డీయే కూటమి ఘనంగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న కేంద్రమంత్రి, ఎమ్మెల్యే, మేయర్ అభ్యర్థి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Oct 2026 6:35 AM IST
Guntur
X

Guntur: గుంటూరు పశ్చిమంలో రూ.450 కోట్లతో ప్రగతి పరుగులు!

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి, ఎన్డీయే కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, స్థానిక టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు రోడ్‌షోలో పాల్గొన్నారు. మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రచార మార్గాలు సందడిగా మారాయి.

58, 59, 60, 61, 42వ డివిజన్ల పరిధిలో సాగిన రోడ్‌షో కోరిటిపాడు గాంధీ బొమ్మల సెంటర్‌ నుంచి ప్రారంభమై కోరిటిపాడు లైబ్రరీ సెంటర్‌, చైతన్యపురి ప్రధాన రహదారి, ముత్యాలరెడ్డి నగర్‌ ప్రధాన రహదారి, వేలంగిని నగర్‌ ఆర్చి, అమరావతి రోడ్డు, ఆల హాస్పిటల్‌ మీదుగా కొనసాగింది.

అనంతరం పీఎస్‌ నగర్‌ ప్రధాన రహదారి, చంద్రయ్య నగర్‌ సెంటర్‌ మీదుగా టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకుంది. అక్కడి నుంచి అరండల్‌పేట ఐదో లైన్‌ లైబ్రరీ సెంటర్‌ వరకు రోడ్‌షో ఉత్సాహంగా సాగింది. పలుచోట్ల ప్రజలు నాయకులకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని, మద్దతును వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చి తమకు సేవ చేసే బాధ్యతను అప్పగించారని, అప్పటి నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి చెప్పారు.

పూర్తిగా పట్టణ ప్రాంతంగా ఉన్న గుంటూరు పశ్చిమంలో గతంలో రహదారులు గుంతలమయంగా ఉండేవని, పారిశుద్ధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ 2024కు ముందు, తర్వాత అన్న తేడా స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా ముందుకు సాగుతోందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో విద్యారంగంలో సంస్కరణలు అమలవుతున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.

రాజధాని అమరావతికి అత్యంత చేరువలో ఉన్న గుంటూరు నగరానికి భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేషన్ నిధులను అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో వంతెనలు, నిర్మాణ పనులు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.

ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు రూ.450 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో గుంటూరు నగరానికి మరింత శోభ తీసుకొచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

గతంలో వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌లో ఉన్న సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కంటే గొడవలకే ప్రాధాన్యమిచ్చారని ఎమ్మెల్యే విమర్శించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు తామే స్వయంగా డివిజన్లలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే బాధ్యతాయుతమైన పాలన అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

గుంటూరు నగరపాలక సంస్థకు మేయర్ అభ్యర్థిగా ఉన్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రజా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి పరిష్కార మార్గాలు చూపగల సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తి అని గళ్ళా మాధవి అన్నారు. కోవెలమూడి లక్ష్మీ అపర్ణ నాయకత్వంలో కార్పొరేషన్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్నికయ్యే కార్పొరేటర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నగర అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.

42, 58, 59, 60, 61వ డివిజన్లలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో ప్రచారం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయా డివిజన్లలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. 58వ డివిజన్‌: జనసేన అభ్యర్థి మట్టిపూడి శ్రీలక్ష్మి. 59వ డివిజన్‌: పేరం శ్రీనివాసరావు(టీడీపీ). 60వ డివిజన్‌: ఎలుక ధనలక్ష్మి (టీడీపీ). 61వ డివిజన్‌: బెజ్జం అనిల్‌ (టీడీపీ). 42వ డివిజన్: తాడిశెట్టి ఉత్తేజ్ (టీడీపీ)

అభ్యర్థులందరూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వస్తున్నారని, ప్రజలు వారిని ఆశీర్వదించి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కూటమి నాయకత్వంతో కలిసి ప్రతి డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, కూటమి కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN