Repalle: పోటుమెరకలో కలెక్టర్ వినోద్ కుమార్ విపత్తు పరిశీలన!

Repalle: పోటుమెరకలో అర్ణబ్ తుఫాన్ చర్యలను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశం.

VIJAYA KISHORE, REPALLE
Published on: 27 Oct 2026 7:51 PM IST
Repalle
X

Repalle: పోటుమెరకలో కలెక్టర్ వినోద్ కుమార్ విపత్తు పరిశీలన!

రేపల్లె: అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. మంగళవారం, రేపల్లె మండలం, కైతుపల్లి పంచాయతీ, పోటుమెరక గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించారు.

పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటరు జాబితాను పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ యొక్క పరిస్థితిని ఆయన పంచాయతీ సెక్రెటరీని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ స్టేషన్లో మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల పరిస్థితి పై ఆయన అధికారులను ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు.

అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో తుఫాను ఎప్పుడు వచ్చిందని, దానివల్ల ఏమైనా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగిందా, ఊరి జనాభా మొదలగు వివరములను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామంలో గర్భవతులు ఎంతమంది ఉన్నారు, వారం రోజుల లోపు ప్రసవంకు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఏఎన్ఎం లను ఆరా తీశారు. గ్రామములో 10 మంది గర్భవతులు ఉన్నారని, వారం రోజులలో ప్రసవంకు ఎవరూలేరని వారు కలెక్టర్ కు తెలిపారు.

తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో గ్రామస్తులు బయటికి రాకుండా నవంబర్ మాసపు బియ్యంను ముందుగానే చౌక ధరల దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. చౌక ధరల దుకాణంలో బియ్యం పంపిణీ విషయం గ్రామస్తులకు తెలుసా, బియ్యం తీసుకున్నారా అని ఆయన గ్రామస్తులను అడిగారు. గ్రామంలో పంట పొలాల సాగు విషయమై ఆయన గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంవత్సరం పొలాలకు నీరు తక్కువగా అందిందని అందుకుగాను పొలాలను పంట వేయకుండా వదిలిపెట్టినట్టు గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులందరూ కలిసి పై ఎత్తులో ఉన్న పొలాల వారు నీటి కొరకు కాలువలలో మోటర్లు పెట్టకుండా చూడాలన్నారు. కాలువలోని నీరు చివరి పంట వరకు అందే విధంగా చూడాలన్నారు. కాలువలలో మోటార్లను వెంటనే తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు.

గ్రామంలోని పిల్లలు పాఠశాలలు వెళ్తున్నారా, పెద్దయిన తర్వాత ఏమి అవుతారు అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తుఫాన్ హెచ్చరికలకు సంబంధించి తీసుకున్న చర్లపై ఆయన అధికారులను ఆరా తీశారు. తుఫాను సందర్భంగా గ్రామస్తులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన గ్రామస్తులకు తెలియజేశారు. పునరావాస కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. గ్రామంలోని సమస్యలపై ఆయన గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో నిరుపేద కుటుంబమైన రేపల్లె జయప్రద నివాస గృహమును జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పరిశీలించారు. జయప్రద వారి యొక్క కుటుంబం, సంతానం, జీవనాధారం గురించి ఆయన తెలుసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందుకుందా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయప్రదకు పిఎంఏవై పథకం కింద ఇల్లు నిర్మాణానికి నగదు మంజూరైనట్లుగా, ఆ నగదు త్వరలోనే అందజేయబడుతుందని కలెక్టర్ ఆమెకు తెలిపారు.

పోటుమెరక గ్రామంలో చౌక ధరల దుకాణంను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సందర్శించారు. దుకాణంలో బియ్యం పంపిణీ ని ఆయన పరిశీలించారు. ఆ దుకాణం పరిధిలో ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎంతమందికి బియ్యం పంపిణీ చేశారు మొదలు వివరములను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులకు ఆయన బియ్యం మరియు పంచదారను అందజేశారు. గ్రామస్తుల కార్డులను ఆయన పరిశీలించారు. చౌక ధరల దుకాణం ద్వారా ప్రతినెల బియ్యం సక్రమంగా పంపిణీ జరుగుతుందా లేదా అని ఆయన గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గ్రామంలో 100 ఎకరాల్లో సాగులో ఉన్న చేపల పెంపకం ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పరిశీలించారు. చేపల పెంపకం, చేపల దాన, చేపల వ్యాపారం, లాభనష్టాలు మొదలగు విషయాలను ఆయన చేపలు పంపక యజమానులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి జగన్ మోహనరావు,రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీదేవి, తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో రమేష్ బాబు, ఎఫ్.డి.ఓ కౌసర్, ఇతర అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE