Palnadu: శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమను కాపాడాలి: ఏఐటీయూసీ డిమాండ్

Palnadu: పల్నాడులోని శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, యాజమాన్య అక్రమాలపై విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 6:02 PM IST
Palnadu
X

Palnadu: శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమను కాపాడాలి: ఏఐటీయూసీ డిమాండ్

గుంటూరు: పల్నాడు జిల్లాలోని శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమను కాపాడాలని, అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ ఫెడరేషన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గుంటూరు మల్లయ్యలింగంభవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో సుమారు 80 లక్షల చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నాలుగు లేబర్ కోడ్ల వలన కార్మికవర్గం తీవ్ర ఇబ్బందులకు గురౌతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పీష్ఠీపీ విధానం అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు కట్టబెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో నడిచే పరిశ్రమలను సైతం ప్రైవేటుపరం చేయడం సమంజనం కాదని అన్నారు.

పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలను మూసివేసి కార్మికులను వీధుల్లో పడేలా చేస్తున్నారని విమర్శించారు.

ముఖ్యంగా సిమెంట్ రంగంలో ఉత్పిత్తికి తగ్గట్టు అమ్మకాలు ఆశాజనంగా ఉన్నప్పటికీ పరిశ్రమలు మూతవేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లాలోని శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమ ఆక్రమంగా లాకౌట్ ప్రకటించడంతో దశాబ్దాలుగా పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు నేడు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు.

దీనిపై అనేక దఫాలుగా యాజమాన్యం, కార్మిక శాఖతో చర్చలు జరిగాయని, కానీ యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేసేలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. సిమెంట్ పరిశ్రమలకు వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్దఎత్తున పోరాటం తప్పదని వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. మోహన్ రావు మాట్లాడుతూ శ్రీ చక్ర సిమెంట్ యాజమాన్య వైఖరిపై ఉద్యమ కార్యాచరణకు సిద్దమౌతున్నట్లు ప్రకటించారు.

కార్మిక శాఖ, కార్మికులు, యాజమాన్యంతో జరిగిన చర్చలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా దాటవేత వైఖరిని యాజమాన్యం అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమను మూతవేసి ఆస్తులను అమ్ముకుని వందల కోట్లు కూడబెట్టుకోవాలనే దురాశతో యాజమాన్యం ఉందని ఆరోపించారు. యాజమాన్య ఆర్థిక అక్రమ లావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు ప్రకటిస్తూ పరిశ్రమల స్థాపనకు చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామని, అయితే రాష్ట్రంలో మూతబడుతున్న పరిశ్రమల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని ఆయన సూచించారు.

ఉత్పిత్తికి అవసరమైన మిషనరీ, మైనింగ్లు ఉన్న శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమకు కూడా రాయితీలు ఇస్తే కార్మికులు పరిశ్రమను లాభాల బాటలో నడిపించుకుంటారని మోహన్రావు స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని కోరారు. కార్మిక శాఖ ప్రేక్షకపాత్ర పోషించకుండా తన పనిని సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.

శ్రీ చక్ర సిమెంట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం ఆగదని, పరిశ్రమ గేటు ఎదుట దీర్ఘకాలిక పోరాటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల అంజిబాబు, మేడా హనుమంతరావు, శ్రీ చక్ర సిమెంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్కే గాలిబ్, ఐ.అంజయ్య, ఎన్.వెంకట్రావు, జి.వెంకటేశ్వర్లు, కేపీ శ్రీను, డి.సైదులు, ఓ. బాలరాజు, ఓ. రాజారావు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN