Ponnur: అమృత్ 2.0 నిధులతో తాగునీటి ప్రాజెక్టు ఎమ్మెల్యే నరేంద్ర సమీక్ష

Ponnur: పొన్నూరులో అమృత్ 2.0 కింద రూ. 22.10 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.

SHAREEF, PONNURU
Published on: 17 Sept 2026 6:30 AM IST
Ponnur
X

Ponnur: అమృత్ 2.0 నిధులతో తాగునీటి ప్రాజెక్టు ఎమ్మెల్యే నరేంద్ర సమీక్ష

పొన్నూరు: పొన్నూరు పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సురక్షితమైన తాగునీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో అమృత్ 2.0 (AMRUT 2.0) పథకం కింద ప్రభుత్వం రూ.22.10 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

నిధుల మంజూరు అనంతరం చేపట్టాల్సిన పనులు, వాటి అమలు విధానం, నాణ్యతా ప్రమాణాలు, పనుల పురోగతి తదితర అంశాలపై పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ Ch. సురేష్ , పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, డీఈ వెంకయ్య మరియు సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా పనులను సమగ్రంగా చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనుల అమలులో సమన్వయంతో ముందుకు సాగాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు.

రూ.19.06 కోట్లతో తాగునీటి సరఫరా ప్రాజెక్టు

అమృత్ 2.0 పథకం కింద మంజూరైన మొత్తం నిధుల్లో రూ.19.06 కోట్లను తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు కేటాయించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా:

2,000 కిలోలీటర్ల సామర్థ్యంతో 3 నూతన ELSR (Elevated Level Service Reservoir) ట్యాంకుల నిర్మాణం, 5 కిలోమీటర్ల మేర కొత్త పంపింగ్ మెయిన్ పైప్‌లైన్ నిర్మాణం 25 కిలోమీటర్ల మేర కొత్త డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు. పొన్నూరు పట్టణంలోని 5,725 గృహాలకు నూతన హౌస్ సర్వీస్ కనెక్షన్లు (HSCs) ఏర్పాటు చేపట్టనున్నారు.

రూ.3.04 కోట్లతో నీటి వనరుల పునరుద్ధరణ

పట్టణ పరిధిలోని నిరుపయోగంగా ఉన్న నీటి వనరులు, చెరువులను పునరుద్ధరించి, వాటి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సుందరీకరణ చేపట్టేందుకు రూ.3.04 కోట్ల నిధులు కేటాయించారు.

ఈ పనుల ద్వారా పట్టణంలో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు మరింతగా దోహదపడే అవకాశం ఉంది.

పొన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ.22.10 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులను వేగవంతంగా ప్రారంభించి, ప్రజలకు త్వరితగతిన ఫలితాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అధికారులకు సూచించారు.

పొన్నూరు పట్టణానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారంతో నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU