Martur: పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం - ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!
Martur: పర్చూరు నియోజకవర్గంలో 121 మంది లబ్ధిదారులకు రూ.57 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు.
Martur: పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం - ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు!
మార్టూరు: ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేక సతమతమవుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో చెక్కులను ఆయా మండలాల నేతలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో పెద్ద మనసుతో.. ఉదారతతో పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి తాజాగా 121 మంది లబ్ధిదారులకు రూ.57 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. ఈ చెక్కులను ఆయా మండలాలకు పంపించినట్లు వివరించారు. ఇప్పటికే పర్చూరు నియోజకవర్గంలో రూ.22 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం లక్ష్యం
చిన్నపాటి వైద్య ఖర్చులు కూడా భరించలేక పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని ఏలూరి పేర్కొన్నారు. లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వైద్య చికిత్సలను సైతం పేదలు పొందేందుకు ఈ సాయం దోహదపడుతోందన్నారు.
అనారోగ్యంతో కుటుంబ పెద్దలు ఆసుపత్రి పాలైతే ఆర్థికంగా చితికిపోయే కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని చెప్పారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని వివరించారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
పర్చూరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, యువ నాయకుడు , మంత్రి నారా లోకేశ్లకు ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం పొందిన బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించిన సందేశాన్ని వారికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ, కష్టకాలంలో అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.




