Parchur: పర్చూరు రైతన్నల కల సాకారం: గుంటూరు ఛానల్ గెజిట్!

Parchur: పర్చూరు రైతులకు శుభవార్త! గుంటూరు ఛానల్ విస్తరణకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల. 3 గ్రామాల్లో 49.53 ఎకరాల భూసేకరణకు శ్రీకారం.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 19 Sept 2026 10:46 AM IST
Parchur
X

Parchur: పర్చూరు రైతన్నల కల సాకారం: గుంటూరు ఛానల్ గెజిట్!

Parchur: నీళ్లు రాని కాలువ వైపే ఏళ్ల తరబడి ఎదురుచూపులు.. వాన కురిస్తే తప్ప తడవని పొలాలు ఓ రైతన్న ఆవేదన.. ఇదంతా పర్చూరు ప్రాంత రైతుల నిన్నటి కథ. ఈ కథకు నేడు కొత్త మలుపు తిరిగింది. గుంటూరు ఛానల్‌ విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విశేష కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ తో ప్రభుత్వం తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో, పర్చూరు ప్రాంత అభివృద్ధి చరిత్రలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. పర్చూరు నియోజకవర్గ చరిత్రలో కీలక అధ్యాయం మొదలైంది.

గెజిట్‌తో కదిలిన కాలువ పనులు

గుంటూరు కాలువను కి.మీ.70.900 నుంచి కి.మీ.75.035 వరకు విస్తరించడంతోపాటు నాలుగు లిఫ్ట్‌ స్కీంలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం పర్చూరు మండలంలోని ఇనగల్లు, ఏదుబాడు, గర్నెపూడి గ్రామాల పరిధిలో 49.53 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ ప్రభుత్వం జారీ చేసింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ గెజిట్‌ ఎక్స్‌ట్రార్డినరీ నం.377, జి.699లో ఈ నోటిఫికేషన్‌ ప్రచురితమైంది.

పర్చూరు అభివృద్ధికి కొత్త రూపు

గుంటూరు ఛానల్‌ విస్తరణ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, పర్చూరు ప్రాంత భవిష్యత్‌ అభివృద్ధికి కీలక మలుపని రైతులు, స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టుతో తాగునీరు సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైలు రాయిగా నిలవనుంది.సాగునీటి వసతులు మెరుగుపడితే వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించే అవకాశం ఉందని, నీటి వనరుల అభివృద్ధితో పర్చూరుకు కొత్త దిశ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

మాట ఇచ్చారు.. మార్గం చూపారు

గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయని టీడీపీ నేతలు పేర్కొన్నారు. భూసేకరణకు సంబంధించిన ఫైళ్ల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులతో సమన్వయం చేశారని పేర్కొన్నారు. "పది రోజుల్లో గెజిట్‌ విడుదల చేయిస్తా" అని రైతులకు ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారని, ఆ మేరకు ప్రక్రియను వేగవంతం చేయడంపైనే ప్రత్యేక దృష్టి సారించారని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

బొమ్మల సెంటర్‌ లోరైతుల సంబరాలు

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన విషయాన్ని ఎమ్మెల్యే ఏలూరి ప్రకటించడంతో పర్చూరులో ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బొమ్మల సెంటర్‌ లో రైతులు,ప్రజలు ఆనందోత్సాహాలతో కోలాహలంగా మారింది. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న రైతులకు తెలుగుదేశం పార్టీ నేతలు స్వీట్లు పంపిణీ చేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రాజెక్టుకు మళ్లీ కదలిక రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

నాడు ఆగిన అడుగు.. నేడు ముందుకు

గుంటూరు ఛానల్‌ విస్తరణకు గతంలో ఆమోదం లభించి ప్రక్రియ ముందుకు సాగినా, 2019–2024 మధ్య పనులు రద్దయ్యాయని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ తదితరుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతోపాటు, అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ ఎమ్మెల్యే ఏలూరి భూసేకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లారని టీడీపీ నాయకులు తెలిపారు.

రైతుల చిరకాల స్వప్నానికి తొలి అడుగు

గెజిట్‌ నోటిఫికేషన్‌తో భూసేకరణ ప్రక్రియకు అధికారికంగా మార్గం ఏర్పడింది. దీంతో గుంటూరు ఛానల్‌ విస్తరణపై పర్చూరు రైతుల్లో మళ్లీ నమ్మకం బలపడింది. కాలువ పనులు పూర్తయి సాగునీటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తే, పర్చూరు ప్రాంత వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్య ప్రసాద్, నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే ఏలూరి ధన్యవాదాలు తెలిపారు. పర్చూరు ప్రజల చిరకాల స్వప్నం గుంటూరు ఛానల్ నెరవేర్చే దిశగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala