Vinukonda: ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్ సురేష్!

Vinukonda: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్ తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని వినుకొండ తహశీల్దార్ సురేష్ అధికారులను ఆదేశించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 16 Nov 2026 5:49 PM IST
Vinukonda
X

Vinukonda: ఆక్వాన్ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్ సురేష్!

వినుకొండ: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆక్వాన్ తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని వినుకొండ మండల తహశీల్దార్ సురేష్ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

భారీ గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోతే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫరా, రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని, అత్యవసర మందులు, అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA