Vinukonda: కడుపుమండి రోడ్డెక్కిన రైతులు: విద్యుత్ సమస్యపై ఆందోళన!

Vinukonda: పల్నాడు జిల్లా ఈపూరు మండలం వనికుంట గ్రామ రైతులు మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక వరి పంటలు ఎండిపోతుండటంతో ఆదివారం సబ్‌స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 15 Nov 2026 5:37 PM IST
Vinukonda
X

Vinukonda: కడుపుమండి రోడ్డెక్కిన రైతులు: విద్యుత్ సమస్యపై ఆందోళన!

వినుకొండ: విద్యుత్ సరఫరా లేక వరి పంటలు ఎండిపోతుండటంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈపూరు మండలం వనికుంట గ్రామానికి చెందిన రైతులు ఆదివారం ఈపూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట వినుకొండ–కారంపూడి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో వ్యవసాయ మోటార్లు పనిచేయడం లేదని, దీంతో పొలాలకు నీరు అందక వరి పైరు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. విద్యుత్ లేకపోతే ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీళ్లు పెట్టుకోవచ్చంటూ అధికారులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దీంతో చేసేదేమీ లేక రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టామన్నారు.రైతుల ఆందోళనతో వినుకొండ–కారంపూడి రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA