Palnadu: పల్నాడు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!
Palnadu: పల్నాడు జిల్లా మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ కృతిక శుక్ల సమీక్ష. వినుకొండలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.
Palnadu: పల్నాడు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్!
Palnadu: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూములు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం వినుకొండ పట్టణంలోని లయోలా హైస్కూల్లో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాన్ని, నిర్మల హైస్కూల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.కౌంటింగ్ కేంద్రంలో టేబుళ్ల ఏర్పాటు, బ్యారికేడింగ్, రిసెప్షన్‌తో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌కు ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేయాలి, ఎన్ని రౌండ్లలో లెక్కింపు చేపట్టాలి అనే అంశాలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ సమయంలో వర్షం కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించే సమయంలో ఏ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బాక్సులను ఏ టేబుల్ వద్దకు పంపించాలనే అంశంపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. బాక్సుల తరలింపులో ఎలాంటి గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించి, నిర్దేశిత గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.




