Guntur: ఎరువుల సరఫరాలో లోపాలు ఉండరాదు: జేసీ
Guntur: గుంటూరు జిల్లాలో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎయిమ్స్ యాప్ ద్వారా పంపిణీ జరగాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు.
Guntur: ఎరువుల సరఫరాలో లోపాలు ఉండరాదు: జేసీ
గుంటూరు: ఎరువుల సరఫరాలో సమస్యలు ఉండరాదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాథమిక రంగాలపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. యూరియా, ఎరువుల సరఫరా, డిమాండ్ అంచనాలు వేసి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడా లోపం ఉండరాదన్నారు. ఎయిమ్స్ యాప్ ద్వారా పంపిణీ జరగాలన్నారు. రైతుల ఇ - కేవైసి త్వరగా చేయించాలన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగు పరచుకోవాల్సి ఉందని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రాథమిక రంగాల శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో సూచనలు, సలహాలు అందించాలని తద్వారా పంటలు, పశువుల పోషణ సక్రమంగా జరిగి ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఆవులు, గేదెల పెంపకం వలన పాల ఉత్పత్తికి దోహదం చేయవచ్చని, కోళ్ళు, మేకల పెంపకం కూడా ఆర్థిక అభ్యున్నతికి అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న లక్ష్యాలను చేయడంలో అశ్రద్ద చేయరాదని అన్నారు. ప్రకృతి వ్యవసాయం దిశగా ఎక్కువ మంది రైతులు మార్పు చెందుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎం. పద్మావతి మాట్లాడుతూ ఇ - పంట 97 శాతం పూర్తి అయిందన్నారు. లక్ష్యం మేరకు పూర్తి చేస్తామని చెప్పారు. సిబ్బంది కరువు లెక్కల సేకరణలో కొంత మేర నిమగ్నం కావడం వలన కొంత జాప్యం జరిగిందన్నారు. సి.సి.ఆర్సి బీమా శత శాతం చేశామన్నారు. మూడు డ్రోన్ లు ఎస్.సి లబ్ధిదారులకు రావలసి ఉందన్నారు.
మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి మాట్లాడుతూ యూరియా, ఎరువుల కొరత లేదన్నారు. ప్రకృతి వ్యవసాయం డి.పి.ఎం రాజ కుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం క్రింద 49,620 ఎకరాలలో 44,029 మంది రైతులు చేయుటకు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని వివరించారు.
ఈ సమావేశంలో ఉద్యాన శాఖ ఉప సంచాలకులు మరియు ఎ.పిఎం.ఐ.పి పి.డి ఎల్. వజ్రశ్రీ, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.




