Guntur: ఎన్‌ఎంఎంఎస్‌లో గుంటూరు విద్యార్థులు అత్యధికంగా అర్హత సాధించాలి
Guntur: గుంటూరు ఏసీ కళాశాలలో ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రేరణ తరగతులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Guntur: ఎన్‌ఎంఎంఎస్‌లో గుంటూరు విద్యార్థులు అత్యధికంగా అర్హత సాధించాలి
గుంటూరు: ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో గుంటూరు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో అర్హత సాధించి, కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు. మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని ఏసీ కళాశాల ఆడిటోరియంలో ఎనిమిదో తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ తరగతులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించేందుకు ఎన్‌ఎంఎంఎస్ ఉపకార వేతనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, శిక్షణ అందిస్తే మంచి ఫలితాలు సాధించగలరన్నారు.
మానవత సంస్థ గత ఏడాది సుమారు 200 మంది విద్యార్థులు అర్హత సాధించేలా శిక్షణ అందించిందని, ఈ ఏడాది 700 మందికి పైగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏసీ కళాశాల ప్రాంగణంలో డిజిటల్ పద్ధతుల్లో ఉచితంగా శిక్షణ అందించడం, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న సంస్థ నిర్వాహకులు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, దాతలు, కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు.
ఎన్‌ఎంఎంఎస్ శిక్షణ ఉపకార వేతనాలకే పరిమితం కాదని, భవిష్యత్తులో వివిధ ప్రతిభా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పునాదిగా నిలుస్తుందని చెప్పారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టి సారించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భారత్‌పేటకు చెందిన షణ్ముఖ అనే విద్యార్థి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధిస్తే, గతంలో విద్యార్థులను ఢిల్లీకి తీసుకెళ్లిన విధంగా తననూ తీసుకెళ్తారా అని అడిగాడని ఎమ్మెల్యే తెలిపారు. ఆ విద్యార్థి మంచి ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందాలని ఆకాంక్షించారు. అతని కలలను సాకారం చేసుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని, వారికి సరైన శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు.




