Ponnuru: పొన్నూరులో నూతన అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాల అందజేత!

Ponnuru: పొన్నూరులో నూతన అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నియామక పత్రాలు అందజేసి, చిన్నారులకు పౌష్టికాహార సామగ్రి పంపిణీ చేశారు.

SHAREEF, PONNURU
Published on: 30 Sept 2026 6:42 PM IST
Ponnuru
X

Ponnuru: పొన్నూరులో నూతన అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాల అందజేత!

Ponnuru: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, విద్యా సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.

బుధవారం పొన్నూరు మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమం మరియు సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తక్కెళ్లపాడు, శేకూరుపాలెం, దొప్పలపూడి, చింతలపూడి గ్రామాలకు నూతనంగా ఎంపికైన అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లోని 2,926 మంది చిన్నారులకు పాఠ్యపుస్తకాలు, పౌష్టికాహారం తీసుకునేందుకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. అలాగే 482 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు దుస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషణతో పాటు ప్రాథమిక విద్యకు అంగన్వాడీ కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం, విద్యా సామగ్రి అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందిస్తున్న సేవలు అభినందనీయమని, వారి సేవలను మరింత సమర్థవంతంగా కొనసాగించేలా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. నూతనంగా ఎంపికైన అంగన్వాడీ టీచర్లు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహించి, చిన్నారుల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ అందించడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, పొన్నూరు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు, సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU