Ponnur: పొన్నూరులో కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి!
Ponnur: పొన్నూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలన్నింటినీ కూటమి కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు.
Ponnur: పొన్నూరులో కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి!
Ponnur: పొన్నూరు మండలంలో ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పొన్నూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో భాగంగా వివిధ గ్రామాల్లో పర్యటించి అభ్యర్థులను నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పొన్నూరు మండలంలో కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.
జనసేనకు కేటాయించిన వెల్లలూరు , అరేమండ, కసుకర్రు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు అందించాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు.
గ్రామాల్లో వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, స్థానిక విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు చేసే ప్రతి చర్య పార్టీ విజయంపై ప్రభావం చూపుతుందని, అభ్యర్థులకు వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీ విజయానికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి నియమించిన ఇన్ఛార్జ్లు, ఎంపీటీసీల వారీగా బాధ్యతలు తీసుకున్న నాయకులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. సీనియర్ నాయకులు ప్రత్యేక బాధ్యతలు తీసుకొని ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ, ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరాలని తెలిపారు. అభ్యర్థులు సైతం ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయాలన్నారు.
ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), పెన్షన్లు తదితర ప్రయోజనాలను ప్రజలకు వివరించి, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, రాబోయే మూడేళ్లలో గ్రామాల అభివృద్ధికి చేపట్టనున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రస్తుతం ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు, భవిష్యత్తులో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి మద్దతుదారులను గెలిపించుకునేలా ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పొన్నూరు మండలం పార్టీకి అత్యంత కీలకమని, మండలంలోని అన్ని స్థానాల్లో విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని అన్నారు.
పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఎన్నికల ప్రచారంలో ఎక్కడ తన అవసరం ఉన్నా తెలియజేస్తే తాను స్వయంగా వచ్చి ప్రచారంలో పాల్గొంటానని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తెలిపారు.
కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, పొన్నూరు మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు.




