Mangalagiri: మంగళగిరి నగరపాలక సంస్థకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్!

Mangalagiri: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పొడి వ్యర్థాలు సేకరించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 1 Oct 2026 7:10 AM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరి నగరపాలక సంస్థకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్!

Mangalagiri: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛతా హీ సేవ–2026’ కార్యక్రమాల్లో భాగంగా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం విశేష స్పందనతో సాగింది. నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 170 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 35,147 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పొడి వ్యర్థాలను తీసుకువచ్చి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సేకరణ కేంద్రాలకు అందించారు. సుమారు 50 వేల కిలోల పొడి వ్యర్థాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.

కాగితం, ప్లాస్టిక్, మెటల్ తదితర వ్యర్థాలను వేర్వేరు విభాగాలుగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

రికార్డుల్లోకి ‘స్వచ్ఛ పాఠశాల’

నిడమర్రులోని లీప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్–సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ డా. ఉల్లాజీ ఎలియాజర్ హాజరయ్యారు.

కార్యక్రమ నిర్వహణ, విద్యార్థుల భాగస్వామ్యం, వ్యర్థాల సేకరణ తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ధృవీకరణ పత్రాన్ని మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీమ్ బాషాకు అందజేశారు. ఈ సందర్భంగా అత్యధికంగా పొడి వ్యర్థాలను సేకరించి పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

‘స్వచ్ఛత ఒకరోజు కార్యక్రమం కాదు’

నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీమ్ బాషా మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ నిరంతరం పాటించాల్సిన సామాజిక బాధ్యత అని అన్నారు. విద్యార్థులు తమ ఇళ్లలోనే తడి, పొడి వ్యర్థాలను వేరు చేసే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.

“నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. నేడు అలవరచుకునే స్వచ్ఛతా నియమాలే రేపటి స్వచ్ఛ భారత్‌కు సోపానాలు” అని పేర్కొన్నారు.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI