Guntur: ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు నమోదుపై డిఆర్ఓ సమీక్ష!

Guntur: ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓటరు జాబితా తయారీపై ఆరు జిల్లాల అధికారులతో గుంటూరు డిఆర్ఓ ఖాజావలి వీడియో కాన్ఫరెన్స్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 14 Oct 2026 1:24 PM IST
Guntur
X

Guntur: ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు నమోదుపై డిఆర్ఓ సమీక్ష!

Guntur: ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎలక్టోరల్ రోల్స్ తయారీలో అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడిని ఓటరుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓటరు జాబితా తయారీపై బుధవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు యం ఈ ఓ లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాల తయారీ, ఉపాధ్యాయుల అర్హతలు, నమోదు ప్రక్రియ, నిర్ణీత గడువులోగా జాబితాల ప్రచురణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎలక్టోరల్ రోల్స్ తయారీలో ఎలాంటి పొరపాట్లకు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా నిబంధనల ప్రకారం పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఉన్నత పాఠశాలలు, ఆపై స్థాయి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ ఎన్నికల్లో ఓటరుగా నమోదయ్యేందుకు అర్హులని తెలిపారు. నవంబర్ 1, 2026 నాటికి గత ఆరు సంవత్సరాల కాలంలో కనీసం మూడు సంవత్సరాల బోధనా అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాధారణ ఓటరుగా నమోదై ఉండాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ గుర్తింపు కలిగి ఉండాలని వివరించారు. పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఓటరుగా నమోదుకు అర్హులు కారని స్పష్టం చేశారు. ఓటరు నమోదుకు సంబంధించిన నిబంధనలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి, అర్హులైన ఉపాధ్యాయులెవరూ నమోదు ప్రక్రియకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎలక్టోరల్ రోల్స్ తయారీకి సంబంధించి నవంబర్ 25, 2026న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ 30, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. ఈ గడువులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, నిర్ణీత సమయంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు నమోదు అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. విస్తృత ప్రచారం ద్వారా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి, ఎలక్టోరల్ రోల్స్ తయారీ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN