Vinukonda: వినుకొండలో జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై జేసీ సంజన శ్రీహర్ష సమీక్ష!!

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష పరిశీలించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 17 Oct 2026 3:49 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై జేసీ సంజన శ్రీహర్ష సమీక్ష!!

Vinukonda: జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్, సంజన శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించి వినుకొండ పట్టణంలోని లయోలా స్కూల్, నిర్మలా స్కూల్‌లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాల అందుబాటు, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటల పాటు నిరంతర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి దశలోనూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

అలాగే రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని జేసీ సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA