Mangalagiri: ఘనంగా 23వ బ్యాచ్ కెనైన్ హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్!
Mangalagiri: అమరావతిలో జరిగిన 23వ బ్యాచ్ కెనైన్ హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు అందజేశారు.
Mangalagiri: ఘనంగా 23వ బ్యాచ్ కెనైన్ హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్!
Mangalagiri: రాష్ట్ర పోలీస్ శాఖలో కెనైన్ దళం కీలక భూమిక పోషిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలో నిర్వహించిన 23వ బ్యాచ్ కెనైన్ హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 36 కెనైన్స్, వారి హ్యాండ్లర్లు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీజీపీతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కెనైన్స్, హ్యాండ్లర్ల ప్రతిభను అభినందించిన హోంమంత్రి అనిత వారికి అవార్డులు అందజేశారు. అనంతరం హోం మంత్రి అనిత మాట్లాడుతూ 23వ బ్యాచ్ కెనైన్స్, హ్యాండ్లర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంతో కష్టమైన శిక్షణను పూర్తి చేసుకుని రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్న 36 కెనైన్స్, వారి హ్యాండ్లర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మనిషి కళ్లకు కనిపించని జాడను, టెక్నాలజీ గుర్తించలేని వాసనను, మనిషి గుర్తించలేని చిన్న ఆనవాలను సైతం కెనైన్ తన ముక్కుతో గుర్తించగలదని అనిత అన్నారు. మనిషి ఆలోచన ఆగిపోయిన చోట, టెక్నాలజీకి ఆధారాలు దొరకని చోట కెనైన్ తన అన్వేషణను ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కెనైన్ దళం ఇప్పటికే ఎన్నో కేసుల ఛేదనలో పోలీసులకు కీలకంగా సహకరించిందని తెలిపారు. మనిషి చేరుకోలేని ప్రాంతాల్లోకి వెళ్లి ప్రాణాలతో ఉన్న వారి జాడను గుర్తించడం, వారిని చేరుకునే మార్గాన్ని చూపించడం వంటి సేవలను కెనైన్స్ అందిస్తున్నాయని చెప్పారు. విపత్తుల సమయంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇతర రక్షణ బృందాలకు కూడా కెనైన్ దళం సహాయకారిగా నిలుస్తోందన్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో కెనైన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. వాహనాల్లో, పార్సిళ్లలో లేదా ఇతర ప్రాంతాల్లో గంజాయిని దాచినా కెనైన్స్ తమ వాసన శక్తితో గుర్తించగలవని చెప్పారు. అదే విధంగా అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో ట్రాకర్ కెనైన్స్ పోలీసులకు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు.
హ్యాండ్లర్ల సేవలు అభినందనీయం
ఎండైనా, వానైనా, పగలైనా, రాత్రైనా తమ కెనైన్స్‌తో కలిసి విధుల్లో నిలబడుతున్న కెనైన్ హ్యాండ్లర్ల సేవలను అనిత ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి కెనైన్‌ను తయారు చేయడం వెనుక ఎంత శిక్షణ, శ్రమ ఉంటుందో.. ఒక మంచి హ్యాండ్లర్‌ను తీర్చిదిద్దడం వెనుక కూడా అంతే కష్టం ఉంటుందని అన్నారు.




