Guntur: గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా డి. అరుణ ఏకగ్రీవ ఎన్నిక

Guntur: గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా డి. అరుణ, వైస్ చైర్‌పర్సన్‌గా టి. అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు; కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 20 Nov 2026 6:21 PM IST
Guntur
X

Guntur: గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌గా డి. అరుణ ఏకగ్రీవ ఎన్నిక

గుంటూరు: గుంటూరు జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల్లో విజయం సాధించిన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ వ్యవహరించి నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారం చేసిన జడ్పీటీసీ సభ్యులు:

1. ప్రత్తిపాడు – ఎ. బసవ బాబు

2. దుగ్గిరాల – టి. అశోక్ కుమార్

3. చేబ్రోలు – ఎం. కృష్ణయ్య

4. మేడికొండూరు – కె. సుమలత

5. కొల్లిపర – జి. సూర్యకుమారి

6. గుంటూరు రూరల్ – సి.హెచ్. సాంబశివరావు

7. వట్టిచెరుకూరు – డి. అరుణ

8. పెదనందిపాడు – డి. ఉషాకిరణ్మయి

9. కాకుమాను – డి. కోటేశ్వరరావు

10. తెనాలి – ఎన్. అన్నపూర్ణ

11. ఫిరంగిపురం – షేక్ జహంగీర్

12. పెదకాకాని – డి. సునీత

13. పొన్నూరు – సుధా ప్రభావతి

అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. చైర్‌పర్సన్ పదవికి వట్టిచెరుకూరు జడ్పీటీసీ సభ్యురాలు డి. అరుణ పేరును ప్రత్తిపాడు జడ్పీటీసీ సభ్యుడు ఎ. బసవ బాబు ప్రతిపాదించగా, కాకుమాను జడ్పీటీసీ సభ్యుడు డి. కోటేశ్వరరావు బలపరిచారు.

అదేవిధంగా వైస్ చైర్‌పర్సన్ పదవికి దుగ్గిరాల జడ్పీటీసీ సభ్యుడు టి. అశోక్ కుమార్ పేరును చేబ్రోలు జడ్పీటీసీ సభ్యుడు ఎం. కృష్ణయ్య ప్రతిపాదించగా, తెనాలి జడ్పీటీసీ సభ్యురాలు ఎన్. అన్నపూర్ణ బలపరిచారు.

ఇతర అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా డి. అరుణ, వైస్ చైర్‌పర్సన్‌గా టి. అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారికంగా ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి: కలెక్టర్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ మాట్లాడుతూ, ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన జడ్పీటీసీ సభ్యులందరికీ ముందుగా అభినందనలు తెలియజేశారు. ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

రాబోయే రోజుల్లో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను గుర్తించి, వాటి పరిష్కారానికి జిల్లా పరిషత్‌ను ఒక మంచి వేదికగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులందరితో కలిసి పనిచేయడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ గుంటూరు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు జడ్పీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జ్యోతి బసు , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN