Namburu: గెలుపుపై నమ్మకం లేకే టీడీపీ శిఖండి రాజకీయాలు నంబూరు!
Namburu: గుంటూరులో వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఫైర్. టీడీపీ కండువాలు వదిలి వైయస్సార్సీపీ కండువాలతో నామినేషన్లా అని నిలదీత.
Namburu: గెలుపుపై నమ్మకం లేకే టీడీపీ శిఖండి రాజకీయాలు నంబూరు!
నంబూరు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ, పోలీసుల వ్యవహారశైలిపై గుంటూరులోని జేకేసీ రోడ్డులో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ కేంద్రాల వద్ద దాడులు, బెదిరింపులకు పాల్పడటం, మహిళా అభ్యర్థుల పట్ల అవమానకరంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో వైయస్ఆర్సీపీ కండువాలు కప్పుకొని టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి రావడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాల దుస్థితికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపై గుంటూరులోని జేకేసీ రోడ్డులో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నంబూరు శంకరరావు మాట్లాడారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్ వేసే హక్కును కల్పించాలని స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో నంబూరు శంకరరావు ఏమన్నారంటే..
- ఇది టీడీపీ శిఖండి రాజకీయాలకు పరాకాష్ఠ
“43–44 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ, ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక దౌర్జన్యాలకు దిగజారడం సిగ్గుచేటు. రాజధానికి ఆనుకొని ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలంలోనే వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. గెలుపుపై నమ్మకం ఉంటే ఎన్నికలను స్వేచ్ఛగా ఎదుర్కోవాలి.
కానీ రౌడీలు, గూండాలను రంగంలోకి దించి, కర్రలు, కత్తులు, రాడ్లతో భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లను అడ్డుకోవడమేంటి? వైయస్ఆర్సీపీ కండువాలు కప్పుకొని టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసే దుస్థితి ఎందుకు వచ్చింది? ఇది టీడీపీ శిఖండి రాజకీయాలకు పరాకాష్ఠ. చంద్రబాబు నాయుడు గారు, మీ పాలనలో రాజధాని పక్కనే ఎన్నికలను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలి.
- నామినేషన్ కేంద్రాల వద్ద దాడులు.. మహిళా అభ్యర్థులకూ రక్షణ లేదా?
నామినేషన్లు వేయడానికి వెళ్లిన మా అభ్యర్థులను అడ్డుకోవడం, కొట్టడం, నామినేషన్ పత్రాలు లాక్కోవడం, ఫోన్లు ధ్వంసం చేయడం, బెదిరింపులకు పాల్పడటం ఏ ప్రజాస్వామ్యంలోనైనా సమర్థించగలమా? అమరావతి నుంచి నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళా అభ్యర్థులపైనా దాడులు జరిగాయని, వారి పత్రాలను లాక్కునే ప్రయత్నాలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. కోసూరు నుంచి వెళ్లిన చిన్నబాబును తీవ్రంగా కొట్టారు.
ఫోన్ లాక్కొని చెవికి గాయమయ్యేలా దాడి చేశారని చెబుతున్నారు. మా నాయకులను అర్ధరాత్రి ఇళ్ల నుంచి తీసుకెళ్లడం, గృహ నిర్బంధాలు చేయడం, పోలీస్ స్టేషన్ల ఎదుటే బెదిరింపులకు పాల్పడటం ఏమిటి? నామినేషన్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థులకు భద్రత కల్పించాల్సిన వ్యవస్థే వారికి అడ్డంకిగా మారితే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడ? ఇలాంటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
- పోలీసులూ, ఉన్నతాధికారులూ బాధ్యత గుర్తించాలి
ఎస్పీ, కలెక్టర్, ఎన్నికల అధికారులకు మా అభ్యర్థుల జాబితాలు పంపించి, వారికి రక్షణ కల్పించి నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వాలని కోరాం. 60 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, ఐదుగురు జెడ్పీటీసీ అభ్యర్థుల భద్రత కోసం కూడా విజ్ఞప్తులు చేశాం. అయినా నామినేషన్ల ప్రక్రియలో మా అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులకు ఒకటే చెబుతున్నాం.
మీరు ఏ రాజకీయ పార్టీకి బానిసలు కాదు; ప్రజలకు, చట్టానికి జవాబుదారీగా పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజల పన్నులతోనే మీకు జీతాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు ఐదేళ్లకే మారిపోతారు, కానీ మీరు దశాబ్దాల పాటు ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఉండకూడదు. పోలీసుల వ్యవహారశైలి మారాలి. దాడులు, బెదిరింపులు, అర్ధరాత్రి అరెస్టులు, అసభ్య పదజాలంతో దూషించడం వెంటనే ఆగాలి.
- వైయస్ఆర్సీపీ కండువాలతో టీడీపీ నామినేషన్లు.. ఇదేం రాజకీయం?
అమరావతి, లకడపాడు, ఇతర ప్రాంతాల్లో వైయస్ఆర్సీపీ కండువాలు కప్పుకొని టీడీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పల్నాడు పోలీసుల అధికారిక సామాజిక మాధ్యమ పేజీలోనూ వైయస్ఆర్సీపీ కండువాలతో అభ్యర్థులను తీసుకెళ్లిన దృశ్యాలు ఉన్నాయి.
మా అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే అడ్డంకులు, దాడులు. మరోవైపు మా పార్టీ కండువాలతో ఇతర అభ్యర్థులకు నామినేషన్ల అవకాశం..ఇది ఎలాంటి వ్యవస్థ? నిజంగా ప్రజల మద్దతు ఉందని నమ్మితే ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించండి. ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల తీర్పును ఎదుర్కోలేక ఇలాంటి పద్ధతులకు దిగడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే.
- ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాలి
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న అభ్యర్థులకు న్యాయం చేయాలి. ప్రతి అభ్యర్థికి భద్రత కల్పించి, నామినేషన్ వేసే హక్కును పరిరక్షించాలి. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనైనా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం సహజం. దౌర్జన్యాలతో ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించండి..ప్రజల తీర్పును గౌరవించండి” అంటూ నంబూరు శంకర్రావు డిమాండ్ చేశారు.




