Guntur: తాడిశెట్టి నివాసంలో సందడి.. లక్ష్మీ అపర్ణకు ఘన స్వాగతం!

Guntur: గుంటూరులో తాడిశెట్టి సోదరుల నివాసంలో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, ఎమ్మెల్యే గల్లా మాధవి సమక్షంలో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 29 Oct 2026 7:04 PM IST
Guntur
X

Guntur: తాడిశెట్టి నివాసంలో సందడి.. లక్ష్మీ అపర్ణకు ఘన స్వాగతం!

గుంటూరు: తాడిశెట్టి సోదరుల నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి, మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి తాడిశెట్టి ఉత్తేజ్, మాదాల చైతన్య, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.

కోవెలమూడి లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ.. మేయర్ అభ్యర్థిగా తనను, కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా తాడిశెట్టి ఉత్తేజ్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ వారికి అవకాశాలు కల్పించడం అభినందనీయమని, సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో ఉత్తేజ్ రాజకీయాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నగర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, ప్రజల ఆశీస్సులు, సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ.. 42వ డివిజన్‌లో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. 42వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి తాడిశెట్టి ఉత్తేజ్‌ను, మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. లక్ష్మీ అపర్ణ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె సహకారంతో గుంటూరు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని గల్లా మాధవి పేర్కొన్నారు.

తాడిశెట్టి ఉత్తేజ్ మాట్లాడుతూ.. ముందుగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్, ఎమ్మెల్యే గల్లా మాధవి కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి ఈ వార్డుతో ఎంతో అనుబంధం ఉందని, ప్రజలకు 100 శాతం నిబద్ధతతో సేవలందిస్తానని చెప్పారు. మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ గారి మార్గదర్శకత్వంలో పనిచేస్తూ వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెడతానన్నారు. ఎన్డీఏ కూటమి నాయకుల సహకారంతో ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని, తన పనితీరుతో నిరూపించుకుంటానని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN