Guntur: గుంటూరు పశ్చిమలో రూ.2.77 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25, 29 డివిజన్లలో రూ.2.77 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు.
Guntur: గుంటూరు పశ్చిమలో రూ.2.77 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 25, 29వ డివిజన్లలో రూ.2.77 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.
25వ డివిజన్ ఆదర్శ్ నగర్‌లో పర్యటించిన సమయంలో సుమారు 40 రోజుల క్రితం స్థానిక మహిళలు రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిధులు మంజూరు చేయించి, పనులు ప్రారంభించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
*29వ డివిజన్ భవానీపురంలో రూ.1.02 కోట్లతో:*
- భవానీపురం 3వ లైన్‌లో రూ.38 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్, ఆర్‌సీసీ కల్వర్టు నిర్మాణం.
- భవానీపురం 2/4లో రూ.32 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్, ఆర్‌సీసీ కల్వర్టు నిర్మాణం.
- భవానీపురం 2/3లో రూ.32 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్, ఆర్‌సీసీ కల్వర్టు నిర్మాణం.
*25వ డివిజన్ ఆదర్శ్ నగర్‌లో రూ.1.75 కోట్లతో:*
- రూ.72 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణం.
- రూ.1.03 కోట్లతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణం.
ఈ పనులతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు, మురుగునీటి పారుదలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఆదర్శ్ నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై మహిళలు తనను కలిసి విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించి, 40 రోజుల్లోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ పనుల మంజూరు, ప్రారంభానికి సహకరించిన నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్, ఏఈలు, ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా దాని పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, వారి ఆశీస్సులతో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు.
బీసీల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉంది
బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలోనూ, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోర్టుల తీర్పులను గౌరవిస్తూనే, బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరిన్ని అవకాశాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తోందని, బీసీలను రాజకీయంగా బలోపేతం చేయడంతోపాటు వారి ఆర్థిక, సామాజిక పురోగతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యానికి రిజర్వేషన్ల అంశం ఒక్కటే పరిమితి కాదని, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం, కూటమి నాయకత్వం నిరంతరం పనిచేస్తాయని చెప్పారు.
బీసీలకు రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధమైన మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తూనే, వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, రాజకీయ ఆరోపణల కంటే ప్రజల అభ్యున్నతికి సంబంధించిన పనులే ముఖ్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




