Guntur: కూటమి ఐక్యతతోనే ప్రజా సంక్షేమం గుంటూరు ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం. కూటమి ఐక్యతతోనే ప్రగతి సాధ్యమని వెల్లడించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 6 Nov 2026 8:01 PM IST
Guntur
X

Guntur: కూటమి ఐక్యతతోనే ప్రజా సంక్షేమం గుంటూరు ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి ఐక్యతే ప్రజా సంక్షేమానికి బలమైన పునాది అని, చిన్నపాటి అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకున్నట్లే మన ముగ్గురం సమన్వయంతో సాగాలని, నాలుగో వ్యక్తికి అధికారాన్ని అప్పగించే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

శుక్రవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధ్యక్షతన నియోజకవర్గ ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు, అభ్యర్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విచ్చేశారు.

కార్పొరేషన్ చైర్మన్లు డేగల ప్రభాకర్, మల్లె ఈశ్వర్ రావు, బుచ్చి రామ్ ప్రసాద్, మద్దిరాల మ్యానీ, తాళ్ళ వెంకటేష్ యాదవ్, కనపర్తి శ్రీనివాసరావు, గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు, కోవెలమూడి రవీంద్ర, జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త కిలారి రోశయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతి రావు, నారాయణ రెడ్డి, అబ్బూరి నాగ మల్లేశ్వరరావు,మానుకొండ శివ ప్రసాద్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... గత 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు, కూటమి శ్రేణులు తనకు 50 వేల భారీ మెజారిటీని అందించి గెలిపించారని, అదే బాధ్యతతో, పార్టీ నాయకులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణని కూడా నియోజకవర్గం నుంచి 50 వేలకు పైగా మెజారిటీతో నిలబెట్టామని, నమ్మిన నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలబడటమే మన రాజకీయ విధానం కావాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

డివిజన్ స్థాయిలో ప్రతి అభ్యర్థి విజయం వెనుక నిస్వార్థంగా శ్రమించిన ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తను, కుటుంబాన్ని ఏమాత్రం విస్మరించకూడదని, అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని చెబుతూ, కార్పొరేటర్లందరూ తమ డివిజన్లలో ప్రత్యేక ముద్ర వేసి ఆదర్శ నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

స్థానిక ప్రజల అవసరాలు, డివిజన్ల అభివృద్ధి ప్రణాళికలను మేయర్ దృష్టికి తీసుకెళ్లి, కౌన్సిల్ ఆమోదంతో పాటు అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించాలని స్పష్టం చేశారు. అలాగే మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచే ఈ నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులు ఆదర్శవంతంగా పనిచేస్తూ నగరవ్యాప్తంగా ప్రగతి పథంలో మార్పును చాటాలని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణలా ప్రజాసేవను బాధ్యతగా భావిస్తూ ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN