Guntur: అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 ప్రదానోత్సవం
Guntur: గుంటూరు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026 విజేతల వివరాలను కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు. అక్టోబర్ 2న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
Guntur: అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 ప్రదానోత్సవం
గుంటూరు: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 బహుకరణ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద స్వచ్ఛత కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు.
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఆర్.ఆర్.ఆర్ (Reduce–Reuse–Recycle) విధానం, పర్యావరణహిత, సుస్థిర పద్ధతుల అమలులో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం 26 విభాగాల్లో సమగ్ర స్వచ్ఛత సర్వే నిర్వహించడం విశేషమన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ తరహాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ను సంస్థాగతం చేసి, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో అత్యుత్తమ పనితీరును గుర్తించడంతో పాటు, స్వచ్ఛత భావనను ప్రజలు, సంస్థలు, అన్ని వర్గాల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించడం జరుగుతోందని వివరించారు.
మూడు దశల్లో అవార్డుల ఎంపిక
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో రేటింగ్/ర్యాంకింగ్ ప్రక్రియను మూడు దశల్లో - స్వీయ మూల్యాంకనం, జిల్లా స్థాయి అధికారుల ధృవీకరణ, మూడవ పక్షం మూల్యాంకనం (థర్డ్ పార్టీ అసెస్‌మెంట్) నిర్వహించారని తెలిపారు.
మొత్తం 1,58,933 కేంద్రాలు స్వీయ మూల్యాంకనంలో పాల్గొన్నాయని చెప్పారు. వాటిలో 1,50,150 కేంద్రాల్లో జిల్లా స్థాయి ధృవీకరణ నిర్వహించారని, వీటిలో 1,960 జిల్లా స్థాయి నుండి
నామినేషన్లు ఎంపికయ్యాయని తెలిపారు. చివరకు 101 ఎంట్రీలు రాష్ట్ర స్థాయి అవార్డుల కోసం పోటీపడ్డాయని అన్నారు.
ఈ మొత్తం మూల్యాంకన ప్రక్రియను స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర (SASA) పోర్టల్, మొబైల్ అప్లికేషన్‌కు అనుసంధానించి పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించారని పేర్కొన్నారు.
వివిధ విభాగాల్లో అవార్డులు
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్‌స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు తదితర అనేక విభాగాల్లో అవార్డులను అందజేస్తున్నారని తెలిపారు.
జిల్లా స్థాయి అవార్డుల ప్రధానం
అక్టోబర్ 2వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల శంకరన్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి విజేతలను సత్కరించడం జరుగుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికైన విజేతల వివరాలు SASA పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి అవార్డు విజేతల వివరాలను కూడా SASA పోర్టల్ (https://sasa.ap.gov.in/) ద్వారా పొందవచ్చన్నారు.
విజేతల వివరాలు
స్వచ్ఛ గ్రామ పంచాయతీలు - వడ్లమూడి, సీతారాంపురం, పొన్నెకల్లు, నంది వెలుగు
స్వచ్ఛ ఎస్ ఎల్ ఎఫ్ - దీపం ఎస్ఎల్ఎఫ్ (ఆత్మకూరు, మంగళగిరి), గుజ్జనగుండ్ల ఎస్ఎల్ఎఫ్ (గుజ్జనగుండ్ల, గుంటూరు) ఐతనగర్ మహిళా స్లం సమాఖ్య (లంకదిబ్బ, తెనాలి)
గ్రామ సమాఖ్యలు - గుంటూరు - ఫిరంగిపురం - హౌస్ గణేష్, గుంటూరు - - పొనుగుపాడు, గుంటూరు - పొన్నూరు - మునిపల్లె, గుంటూరు - తాడికొండ - బందరుపల్లి, గుంటూరు - తాడికొండ - తాడికొండ
స్వచ్ఛ పాఠశాలలు - వెనిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేమవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నెక్కల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వెంగళరావు నగర్ పురపాలక ఉన్నత పాఠశాల
స్వచ్ఛ అంగన్వాడీలు - నల్లపాడు (ఎస్సీ) అంగన్వాడి కేంద్రం, గుంటూరు 13 వార్డు ఒకటవ కేంద్రం, కృష్ణానగర్ మూడవ కేంద్రం, రాయపూడి అంగన్వాడి కేంద్రం, 19వ వార్డు ఎస్టి కాలనీ అంగన్వాడి కేంద్రం
స్వచ్ఛ ఆస్పత్రులు - తెనాలి సిహెచ్ సి, ప్రత్తిపాడు సిహెచ్సి, కొల్లిపర సిహెచ్సి, తాడికొండ జిహెచ్డి, గుంటూరు జియుడి, వట్టిచెరుకూరు పీహెచ్సీ, ఈమని పీహెచ్సీ, కాట్రపాడు పీహెచ్సీ, ఎర్రబాలెం యు పి హెచ్ సి, బృందావన్ గార్డెన్స్ యూపీహెచ్సీ, చౌడవరం యూపీహెచ్సీ
స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు - గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా అటవీ శాఖ కార్యాలయం
స్వచ్ఛ బస్ స్టేషన్ - మంగళగిరి బస్ స్టేషన్ స్వచ్ఛ రైతు బజార్ - తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతు బజార్
స్వచ్ఛ వసతి గృహాలు - ప్రత్తిపాడు సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం, గుంటూరు ప్రభుత్వ బిసి కళాశాల బాలుర వసతిగృహం, గుంటూరు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహం, మైనార్టీ సంక్షేమ వసతిగృహం
ఉత్తమ స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు - మేయర్స్ హోమ్, మహిళ సిస్ సంక్షేమ శాఖ
స్వచ్ఛ వారియర్స్ - మేకల జాలయ్య, అల్లం శ్రీనివాసరావు, ఎర్రం శెట్టి గురుమూర్తి, పొట్నూరి సాంబయ్య, గండికోట సీతయ్య
స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్లు - చింత అలేఖ్య, రేటూరి వేణు, వంకాయలపాటి శోభ, చిలక యేసు మరియమ్మ, గొడవర్తి నాగరాజు
స్వచ్ఛ గురుకులం - తెనాలి హెచ్ సి గురుకులం (బాలికలు)
స్వచ్ఛ పర్యాటక ప్రదేశం - ఉండవల్లి గుహలు
స్వచ్ఛ పార్క్ - కొండపనేని టౌన్షిప్ పార్క్ (ఎంటిఎంసి)
స్వచ్ఛ ఆధ్యాత్మిక ప్రదేశం - వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం (టిటిడి)
స్వచ్ఛ వాణిజ్య ప్రదేశం - హోటల్ వెంకటేష్ గ్రాండ్ (ఆరండల్ పేట)
స్వచ్ఛ రథం - పొన్నూరు మండలం
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 విజేతలను అభినందిస్తూ, స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర (SASA) ఉద్యమాన్ని మరింత ఉత్సాహంతో, సమష్టిగా, నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.




