Guntur: గుంటూరులో పరిషత్ కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు ఎస్పీ వకుల్
Guntur: గుంటూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏఎన్‌యూ, తెనాలి విఎస్ఆర్ కళాశాలల్లో పటిష్ట బందోబస్తు. విజయోత్సవ ర్యాలీలపై ఎస్పీ వకుల్ జిందాల్ నిషేధం.
Guntur: గుంటూరులో పరిషత్ కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు ఎస్పీ వకుల్
గుంటూరు: గుంటూరు జిల్లాలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పెదకాకానిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.కౌంటింగ్ అనంతరం అభ్యర్థులు, వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
కౌంటింగ్ కేంద్రాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థులు, వారి అనుచరుల మధ్య ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.గతంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరైనా ఘర్షణలు, అల్లర్లకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసేలా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.




