Guntur: కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
Guntur: గుంటూరు కిట్స్ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించిన రవాణా శాఖ ఉప కమిషనర్ కె. సీతారామిరెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న 400 మంది విద్యార్థులు.
Guntur: కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
గుంటూరు: విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ ఉప కమిషనర్ కె.సీతారామిరెడ్డి తెలిపారు. గుంటూరులో గల కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు సంకేతాలు, పాఠశాల, కళాశాల బస్సుల భద్రత., యాజమాన్యం, డ్రైవర్లు, విద్యార్థులు, పాదచారుల భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన అవసరం అన్నారు.
రహదారులపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్‌ను వినియోగించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే విద్యార్థులు హెల్మెట్ ధరించడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండడం వంటి భద్రతా చర్యలను పాటించాలని కోరారు.
రోడ్డుపై నడుస్తూ హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాల రక్షణకు కూడా బాధ్యత వహించాలని, రోడ్డు భద్రతా నిబంధనలను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని పేర్కొన్నారు.
“రోడ్డు భద్రత మనందరి బాధ్యత – జాగ్రత్తగా ప్రయాణిద్దాం, సురక్షితంగా ఇంటికి చేరుదాం” అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి పాటించాలని కోరారు. రోడ్డు దాటే ముందు కుడి–ఎడమ వైపు చూసి, వాహనాలు లేవని నిర్ధారించుకోవాలని అన్నారు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తొందరపడకుండా, వాహనం పూర్తిగా ఆగే వరకు వేచి ఉండాలని చెప్పారు.
రోడ్డుపై పరుగెత్తడం, తోటి విద్యార్థులతో ఆటలాడడం చేయరాదని పేర్కొన్నారు. రాత్రి వేళలు లేదా తక్కువ వెలుతురు ఉన్న సమయంలో ప్రతిబింబించే దుస్తులు, ఉపకరణాలు ఉపయోగించడం మరింత శ్రేయస్కరం అన్నారు. ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి వచ్చే వరకు ఇతర సభ్యులు చూస్తుంటారని, ప్రమాదాలు వంటి సంఘటనలు జరిగితే ఆ కుటుంబానికి తీరని ఆవేదన మిగులుతుందని చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా 46 మంది కళాశాల బస్సు డ్రైవర్లకు డ్రైవర్ శిక్షణ రిఫ్రెషర్ కోర్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి కె.శ్రీహరి, కళాశాల అధ్యాపకులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.




