Guntur: గుంటూరు కలెక్టర్‌ను కలిసి తెనాలి తహశీల్దార్‌పై నిరాధార ఆరోపణలపై వినతి

Guntur: తెనాలి తహసీల్దార్‌పై సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్‌కు ఏపీఆర్ఎస్‌ఏ వినతి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Sept 2026 7:03 PM IST
Guntur
X

Guntur: గుంటూరు కలెక్టర్‌ను కలిసి తెనాలి తహశీల్దార్‌పై నిరాధార ఆరోపణలపై వినతి

గుంటూరు: సమాచార హక్కు చట్టం పేరుతో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణపై నిరాధారమైన ఆరోపణలతో సోషల్ మీడియా పత్రికా ముఖంగా బెదిరింపులకు పాల్పడటం వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని తహసీల్దార్లు కలెక్టర్ సాయికాంత్ వర్మను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ను కలిశారు.

ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం సమాచార హక్కు చట్టం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెనాలి తహశీల్దార్ గోపాలకృష్ణపై, అలాగే ఇతర ప్రభుత్వ శాఖల అధికారులపై తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన కాలిశెట్టి ఫణికుమార్, తెనాలి పట్టణానికి చెందిన కామేశ్వరరావు అనే వ్యక్తులు పత్రికలు, సోషల్ మీడియా వేదికల ద్వారా పలు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.

తహశీల్దార్ లంచం డిమాండ్ చేశారని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి నిజానిజాలను సంబంధిత దర్యాప్తు సంస్థలు, అధికారులు చట్ట ప్రకారం నిర్ధారించాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడం, బెదిరింపులకు పాల్పడడం సమర్థనీయం కాదని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎంతో చిత్తశుద్ధితో, నిబద్దతతో అంకితభావంతో ఉన్న తెనాలి తహసీల్దార్ వారి కార్యాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దటంలో గోపాలకృష్ణ పాత్ర ప్రశంసనీయమని చెప్పారు. దీనిపై స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అభినందనలు తెలపడం గర్వకారణం అన్నారు.

దాతల సహకారంతో తహసిల్దార్ కార్యాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దినప్పటికీ ఈ విషయంలోనూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

సదరు వ్యక్తులు గతంలో కూడా ఇదే విధమైన రీతిలో ఒక వైద్యురాలు, దేవాదాయశాఖతో పాటు ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ అంశాలపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. కేసు నమోదైన తర్వాత కూడా ఇప్పటివరకు తదుపరి చర్యలు కనిపించకపోవడంతో, నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేస్తే వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, కానీ బెదిరింపులకు పాల్పడే అంశాలు సరైనవి కాదని చెప్పారు. నిరాధారమైన ఆరోపణల కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో మరో ధైర్యం దెబ్బతింటుందని వివరించారు. వెంటనే సంబంధిత అంశంపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. విధి నిర్వహణలో ఉన్న తహశీల్దార్‌తోపాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని కోరుతున్నామన్నారు.

ఇది కేవలం ఒక అధికారి లేదా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యగా కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి భయాందోళనలు లేకుండా తమ విధులను నిర్వహించేలా చూడాలని అలాగే ఇలాంటి చర్యలకు పునరావితం కాకుండా చర్యలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అదే సమయంలో ఆ చట్టాన్ని ఉపయోగించే హక్కుతోపాటు, ఇతరుల హక్కులు, ప్రతిష్ట, చట్టపరమైన రక్షణలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాబట్టి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, చట్టబద్ధమైన మార్గాల్లోనే సమస్యలను పరిష్కరించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ వినతి మేరకు వెంటనే స్పందించిన కలెక్టర్, సంబంధిత విషయంపై ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ నాయకులకు తెలియజేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN