Guntur: ఎన్నికల ఖర్చుల లెక్కలు పక్కాగా ఉండాలి: జీఎంసీ కమిషనర్!

Guntur: గుంటూరు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులు ఖర్చుల వివరాలను పక్కాగా సమర్పించాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. ఈ నెల 27, 30 తేదీల్లో వ్యయ పరిశీలన జరగనుంది.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Oct 2026 6:26 PM IST
Guntur
X

Guntur: ఎన్నికల ఖర్చుల లెక్కలు పక్కాగా ఉండాలి: జీఎంసీ కమిషనర్!

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలు-2026 ప్రక్రియలో భాగంగా పోటీలో ఉన్న ప్రతీ అభ్యర్థి రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తమ ఎన్నికల వ్యయ ఖాతాలను పక్కాగా నిర్వహించాలని, కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం అభ్యర్ధుల ఖర్చుల నమోదుపై రిటర్నింగ్ అధికారులకు కమిషనర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్దేశిత మార్గాదర్శనం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ల (మేయర్ మరియు సభ్యుల ఎన్నికల నిర్వహణ) నియమావళి 2026 ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ నామినేషన్ దాఖలు చేసిన నాటి నుండి జరిగే రోజువారీ ఎన్నికల వ్యయ వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.

పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చుల వివరాలను, సంబంధిత బిల్లులు, వోచర్లు, రసీదులతో కూడిన ప్రొఫార్మా-II మరియు ప్రొఫార్మా-III రికార్డులను ప్రతి మూడు రోజులకు ఒకసారి పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి పరిశీలనను ఈ నెల 27 తేదీన (నామినేషన్ వేసిన తేదీ నుండి జరిగిన ప్రచార వ్యయం) మరియు రెండవ పరిశీలనను 30 తేదీన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించాలని పేర్కొన్నారు.

అభ్యర్థులు లేదా వారి అధీకృత ఎన్నికల ఏజెంట్లు నిర్ణీత తేదీలలో సమయానికి హాజరై, సారాంశాలు మరియు ఆధార పత్రాలను సమర్పించి తప్పనిసరిగా రసీదు పొందాలని సూచించారు. ఎన్నికల వ్యయ ఖాతాలు పూర్తిగా, ఖచ్చితంగా మరియు వాస్తవికమైనదిగా ఉండాలని, సరైన నమూనాలో ఖాతాలను నిర్వహించడంలో లేదా నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమైతే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చట్టం 1955, సెక్షన్ 20B ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కాబట్టి సంబంధిత అభ్యర్థులందరూ విధిగా ఎన్నికల సంఘం నిబందనలను పాటించవలసిందిగా తెలియచేస్తున్నామన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN