Guntur: జీఎంసీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పకడ్బందీగా వేగవంతం చేయాలని అధికారులకు జీఎంసీ కమిషనర్ కే. మయూర్ అశోక్ ఆదేశాలు జారీ చేశారు.
Guntur: జీఎంసీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాబోయే ఎన్నికల నిర్వహణను అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ స్థానిక ఏసి కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం, గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంభర్ లో ఎన్నికల నిర్వహణపై సంబంధిత విభాగాధిపతులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియకు ప్రాథమికమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, మరియు ఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్ సెంటర్లను తక్షణమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇటీవల నగరంలో వార్డుల పెంపునకు సంబంధించిన తుది గెజిట్ విడుదలైన నేపథ్యంలో, పెరిగిన వార్డులు మరియు నూతన సరిహద్దులకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళిక రూపుదిద్దాలన్నారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు ప్రతీ అధికారి తప్పనిసరిగా 'రిటర్నింగ్ ఆఫీసర్ బుక్'ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నియమ నిబంధనలపై స్పష్టత ఉండాలని సూచించారు. నగరంలో పోలింగ్ కేంద్రాలను త్వరగా ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ నెల 22వ తేదీన నగరపాలక సంస్థ పరిధిలోని ఎలక్టోరల్ రోల్ (ఓటర్ల జాబితా) ప్రచురించాల్సి ఉన్నందున, అందుకు సంబంధించి పట్టణ ప్రణాళిక విభాగాధికారులు ముందస్తు చర్యలను అత్యంత వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటి కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఏసిపీలు రెహ్మాన్, జకిరా, డిప్యూటీ తహశీల్దార్లు నాగమల్లేశ్వరరావు, కిరణ్మై తదితరులు పాల్గొన్నారు.




