Guntur: హరిత శోభితంగా గుంటూరు: 40 కి.మీ. మేర ప్లాంటేషన్ డ్రైవ్!

Guntur: గుంటూరు నగరంలో గ్రీన్ కవర్ పెంచేందుకు రూ.5-6 కోట్లతో 40+ కి.మీ. డివైడర్లలో భారీ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 10 Nov 2026 6:10 PM IST
Guntur
X

Guntur: హరిత శోభితంగా గుంటూరు: 40 కి.మీ. మేర ప్లాంటేషన్ డ్రైవ్!

గుంటూరు: గుంటూరు నగరాన్ని హరితమయంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు గాలి నాణ్యతను పెంచి, నగరానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బృహత్తర ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గుంటూరు నగరవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత సాధించేందుకు ఈ ప్లాంటేషన్ డ్రైవ్ విశేషంగా దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా నగరంలోని దాదాపు 40 పైచిలుకు కిలోమీటర్ల మేర డివైడర్లలో రెండు దశల్లో ప్లాంటేషన్ పనులను వేగవంతం చేశామని, మొదటి దశ కింద 25 కిలోమీటర్లు, రెండో దశలో మిగిలిన 15 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న మొక్కలను అందంగా ట్రిమ్మింగ్ చేయడంతో పాటు, కింద శ్రబ్ ప్లాంటేషన్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టును అత్యంత శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నామని వివరించారు.

గుంటూరు నగర వాతావరణంలో వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, తక్కువ నీటితో పెరిగేలా మరియు జంతువుల వల్ల నష్టం వాటిల్లకుండా ఉండే రకం మొక్కలను ఏపీ గ్రీన్ కార్పొరేషన్ నిపుణుల సలహాలతో ఎంపిక చేశామని చెప్పారు. డివైడర్లలోని పాత మట్టిని పూర్తిగా తొలగించి, మెరుగైన ఎర్రమట్టితో పాటు తగిన ఎరువులను అందిస్తూ మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం సుమారు రూ. 5 నుండి 6 కోట్ల వరకు వ్యయం అవుతుందని పేర్కొన్నారు.

కేవలం మొక్కలు నాటడమే కాకుండా, రాబోయే రెండు సంవత్సరాల పాటు వాటిని సంరక్షించి, సక్రమంగా సంరక్షించాల్సిన బాధ్యతను కాంట్రాక్ట్ నిబంధనలలో భాగంగా సంబంధిత కాంట్రాక్టర్లకే అప్పగించి, మొక్కలు, కాంట్రక్టర్, సంబందిత అధికారుల వివరాలతో సైన్ బోర్డ్ లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN