Guntur: గుంటూరు అభివృద్ధిపై వీడియో చేయాలి!

Guntur: గుంటూరు అభివృద్ధిపై అవగాహన వీడియో చేయాలని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Sept 2026 2:11 PM IST
Guntur
X

Guntur: గుంటూరు అభివృద్ధిపై వీడియో చేయాలి!

Guntur: గుంటూరు నగర అభివృద్ధి కోసం కోసం ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక అవగాహన వీడియో చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి కోరారు. శనివారం తన నివాసంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరులో ఉన్న సమస్యలు, నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల్లో చైతన్యం పెంపొందించే అంశాలపై ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... దేశంలో కొన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉండటానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో పాటు ప్రజల్లో ఉన్న అవగాహన కూడా ప్రధాన కారణమని అన్నారు. గుంటూరులో కూడా అదే స్థాయిలో ప్రజల్లో బాధ్యత పెంపొందించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కీలక పాత్ర పోషించగలరని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. నగరంలో ప్రజా చైతన్యం అవసరమైన ప్రతి అంశం పై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను ఇన్‌ఫ్లుయెన్సర్స్ తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే ఎంతో మందికి చేరువై ప్రభావవంతంగా పనిచేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా గుంటూరు నగర ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తాము రూపొందించే వీడియోల్లో కనీసం ఒక వీడియోను గుంటూరు కోసం, ప్రజల కోసం కేటాయించాలని కోరారు. విమర్శలు చేయడం లేదా వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కాకుండా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించే విధంగా, ప్రజల్లో మంచి మార్పు తీసుకువచ్చేలా అవగాహన వీడియోలు రూపొందించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రస్తావించిన సమస్యల పై ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పందిస్తూ, వాటి పరిష్కారానికి కాలపరిమితి విధించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాధ్యమైన అంశాలను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరో మూడు నెలల తర్వాత మళ్లీ సమావేశమై పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్త సూచనలను కూడా స్వీకరిస్తామని వెల్లడించారు.

యువతకు దిశానిర్దేశం చేసే కార్యక్రమాలు, చిన్నారుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను రూపొందించేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ సహకారం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో తమకు సహకరించాలని కోరారు. గుంటూరు అభివృద్ధి, ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN