Guntur: బీసీల ఐక్యతతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి!

Guntur: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపు. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన బీసీ సంఘాల సమావేశం.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Oct 2026 6:34 PM IST
Guntur
X

Guntur: బీసీల ఐక్యతతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి!

Guntur: బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. గుంటూరు జీటీ రోడ్డులోని ఏ కన్వెన్షన్‌లో కేశన శంకరరావు ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన బీసీ సంఘాల సమైక్య సమావేశానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ బీసీ సామాజికవర్గ నాయకులు, ప్రజలందరినీ ఒకే వేదికపై కలుసుకునే అవకాశం కల్పించిన ఈ సమావేశం ఎంతో ముఖ్యమైనదన్నారు.

2024 ఎన్నికల్లో కూడా వివిధ వర్గాల నాయకులు, ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో మార్పు సాధించడంలో బీసీ నాయకులు, పెద్దల సహకారం కీలకమైందని తెలిపారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాల కోసం అడిగే బాధ్యతను బీసీ నాయకులు నిర్వర్తిస్తుంటే, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కూడా నాయకుల బాధ్యతేనని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందనే నమ్మకం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి

బీసీల అభ్యున్నతి, మహిళల సాధికారత కోసం మొదటి నుంచీ కృషి చేస్తున్న రాజకీయ పార్టీ తెలుగుదేశం అని గళ్ళా మాధవి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలోనూ మహిళలు, బీసీలకు ప్రాధాన్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల అంశంతో పాటు మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విషయంలో కూటమి నాయకత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రజల కోసం నిలబడే ప్రభుత్వానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న బీసీ సంఘాల నాయకులందరికీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

బీసీ సంఘాల నాయకులు సమావేశమై చర్చించుకోవడంతో పాటు, తమ హక్కుల సాధనకు, అభివృద్ధికి సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కూడా అవసరమని ఎమ్మెల్యే అన్నారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం చేయగల నాయకుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరని పేర్కొన్నారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడం అందరికీ ఆశీర్వాదం లాంటిదన్నారు.

బీసీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడానికి, అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి పెద్దలు మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షించారు.

నగరాభివృద్ధికి కూటమి అభ్యర్థులకు సహకరించాలి

గుంటూరు నగరంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్న బీసీ నాయకులు, సంఘాల ప్రతినిధులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విద్యావంతురాలని, విద్యావంతుల చేతుల్లో పాలనా బాధ్యతలు ఉంటే అభివృద్ధికి మరింత అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

గత రెండున్నరేళ్లుగా విద్యావంతుల నాయకత్వంలో పాలన ఎలా ఉండగలదో ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే స్ఫూర్తితో గుంటూరు నగరాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు లక్ష్మీ అపర్ణ నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి తమ తమ డివిజన్లలో అభివృద్ధి కోసం పనిచేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నారని తెలిపారు.

బీసీ సంఘాల నాయకులు ఈ వేదికపై ప్రకటించిన మద్దతుకే పరిమితం కాకుండా, వార్డుల వారీగా వెళ్లి కూటమి అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN