Guntur: రాప్తాడు నిందితుడిని కాపాడేందుకే వైసీపీ 'పిల్' ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Guntur: రాప్తాడు ఘటనలో నిందితుడిని కాపాడేందుకు వైసీపీ లాయర్ కోర్టులో పిల్ వేశారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం. జగన్‌ ద్వంద్వ వైఖరిపై విమర్శలు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 2 Nov 2026 9:59 PM IST
Guntur
X

Guntur: రాప్తాడు నిందితుడిని కాపాడేందుకే వైసీపీ 'పిల్' ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు: ఆడబిడ్డల వేదనపై మాట్లాడే నైతిక హక్కు లేదు వైసీపీ లేదు అని,రాప్తాడు రాక్షసుడిని కాపాడటానికి కోర్టులో ‘పిల్’ వేయించడం పై ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సోమవారం టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాప్తాడులో చిన్నారిపై జరిగిన దాడి అత్యంత అమానవీయమని, ఒక మహిళగా, ఆడపిల్ల తల్లిగా ఆ ఘటన తనను తీవ్ర వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. ఘటన వెలుగుచూసిన వెంటనే మంత్రి నారా లోకేష్ అత్యంత వేగవంతంగా స్పందించి, చిన్నారి మెరుగైన చికిత్స కోసం ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మణిపాల్ ఆస్పత్రికి తరలించారని గుర్తుచేశారు.

ఆ బాలిక తన కన్నబిడ్డతో సమానమని, వైద్య బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని లోకేష్ భరోసా ఇవ్వడమే కాకుండా, బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై సత్వర చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఒక నాయకుడి స్పందన, సమర్థవంతమైన నాయకత్వ పటిమకు లోకేష్ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో బాధితురాలిని పరామర్శించే పేరుతో బెంగళూరు వెళ్లి జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజకీయ హైడ్రామా సృష్టించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. చావుబతుకుల మధ్య ఉన్న చిన్నారి పరిస్థితిని, వైద్యుల వివరాలను అడిగి తెలుసుకోవడం మానేసి, బాధితురాలి పేరును, కుటుంబ సభ్యుల పేర్లను పదేపదే ప్రస్తావిస్తూ మీడియా ముందు రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

బాధితురాలి కుటుంబంలో ఒకరు వైఎస్సార్సీపీ వ్యక్తి అంటూ పార్టీ రంగు పులమడం సిగ్గుచేటని, నారా లోకేష్ పార్టీలు చూడకుండా మానవతా దృక్పథంతో బాధ్యత తీసుకుంటే జగన్ మాత్రం రాజకీయ లబ్ధి కోసం స్క్రూటినీ చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు చిన్నారిపై మొసలి కన్నీరు కారుస్తూనే, మరోవైపు ఆ అకృత్యానికి పాల్పడిన నిందితుడు హేమంత్‌ను కాపాడేందుకు స్వయంగా వైఎస్సార్సీపీ లాయర్ సాల్మన్ రాజుతో హైకోర్టులో పిల్ (PIL) వేయించారని ఆధారాలతో బయటపెట్టారు.

పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు జరిపితే, ఆ నిందితుడి మానవ హక్కుల పేరిట కోర్టుకెక్కడం జగన్ ద్వంద్వ నీతికి నిదర్శనమని, తమ సొంత కుటుంబంలోని ఆడబిడ్డకు ఇలాంటి అన్యాయం జరిగితే నిందితుడిని రక్షించడానికి లాయర్లను రంగంలోకి దించుతారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ నేరస్తులు, హంతకులు, అరాచక శక్తులకు అండగా నిలిచే పార్టీ అని విమర్శించారు.

‘మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తాం’ అంటూ బాధితుల ముందే జగన్ ఓట్ల బేరసారాలు ఆడటం హాస్యాస్పదమని, గతంలో బుడమేరు వరద బాధితులకు కోటి రూపాయలు ఇస్తానని మోసం చేసినట్లే ఇక్కడ కూడా మాటలకే పరిమితమవుతున్నారని గళ్ళా మాధవి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి డిమాండ్లు వినిపించడం కాదని, జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి ఇప్పుడే స్వయంగా రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

డాక్టర్లు ఆ బాలిక ఆరోగ్యం బాగుందని, కోలుకుంటోందని చెప్పడంతో ప్రభుత్వంపై బురదజల్లే అవకాశం లేక జగన్ ముఖంలో నైరాశ్యం కనిపించిందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతి మహిళలపై దాడులు చేయించి, రాష్ట్రాన్ని కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి హబ్‌గా మార్చిన జగన్‌కు నేడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఎన్. చంద్రబాబు నాయుడు నాడు హైదరాబాద్‌లో సీసీటీవీ నెట్‌వర్క్, సైబర్ క్రైమ్ పోలీసింగ్‌ను ప్రవేశపెట్టి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించిన నాయకుడని గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈగల్ (EAGLE) బృందాలను రంగంలోకి దించి గంజాయి రవాణా, సాగును ఉక్కుపాదంతో అణచివేస్తోందని చెప్పారు. ఇప్పటికైనా ఆడబిడ్డల భద్రత, చిన్నారుల రక్షణ వంటి అత్యంత సున్నితమైన అంశాలలో రాజకీయాలు చేయడం మానుకోకపోతే రాష్ట్రంలోని మహిళలు, తల్లులు జగన్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN