Guntur: కూటమి ప్రభుత్వంతోనే నగర సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Guntur: గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. సైకిల్ గుర్తు అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Guntur: కూటమి ప్రభుత్వంతోనే నగర సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు: గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గళ్ళా మాధవి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో 53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సింగంశెట్టి వరలక్ష్మి, 50వ డివిజన్ అభ్యర్థి నులుపూరి శ్రీనివాస్, 38వ డివిజన్ అభ్యర్థి పరుచూరి సంజీవరావు, 37వ డివిజన్ అభ్యర్థి మధులాల్ మరియు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణలకు మద్దతుగా స్థానిక ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా 53వ డివిజన్‌లో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ...
గత ప్రభుత్వ హయాంలో నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలు, తాగునీటి వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నగర రూపురేఖలు మారడం మొదలైందన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేసి అందించిన విజయానికి కృతజ్ఞతగా, బాధ్యతతో పనిచేస్తున్నామని తెలిపారు.
ఈ ఒక్క 53వ డివిజన్‌లోనే దాదాపు రూ.16 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మరియు విద్యుత్ సమస్యల పరిష్కార పనులు చేపట్టామని వివరించారు. స్థానికంగా ఉన్న తాగునీటి ఎద్దడిని గుర్తించి ఇప్పటికే ట్యాంకర్లను ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో శాశ్వతంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఒక భారీ హెచ్‌ఎల్‌ఆర్ (HLR) ట్యాంకర్‌ను మంజూరు చేయించినట్లు వెల్లడించారు.
మున్సిపల్ కార్పొరేషన్‌కు భారీగా వచ్చే నిధులు సక్రమంగా వినియోగపడి, మిగిలిన చిన్న చిన్న సమస్యలు కూడా వేగంగా పరిష్కారం కావాలంటే స్థానిక సంస్థల పాలన సమర్థవంతమైన నాయకత్వం చేతుల్లో ఉండాలన్నారు. మా వాడికి సీటు రాలేదనో, తమ కులం లేదా ప్రాంతం వారికి అవకాశం దక్కలేదనో భావించి ఎవరూ నిరుత్సాహపడొద్దని, మీ అమూల్యమైన ఓటు భవిష్యత్తు తరాలకు నాంది అని పేర్కొన్నారు.
అభివృద్ధిని కాంక్షించే మంచి నాయకత్వానికి పెద్దపీట వేయాలని కోరారు. గత రెండున్నరేళ్ల పాలనలోనే పశ్చిమ నియోజకవర్గంలో రికార్డు స్థాయి అభివృద్ధిని చేసి చూపించామని, భవిష్యత్తులో నగరాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు 53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.




