Guntur: ఈ విజయం కూటమి కార్యకర్తలదే ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం కూటమి కార్యకర్తలదేనని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని అధ్యక్షతన ఆత్మీయ సమావేశం.
Guntur: ఈ విజయం కూటమి కార్యకర్తలదే ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు సాధించిన ఈ విజయం కూటమి కార్యకర్తలదేనని, నగర ప్రజల ఆశీర్వాదంతో గుంటూరును మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.
బుధవారం గుంటూరు నగరంలోని క్యాపిటల్ హోటల్లో కేంద్రమంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన "మేయర్ - కార్పొరేటర్ల" ఆత్మీయ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా కళ్లారా చూసి, ఆదరించి మరోసారి పెద్దపీట వేసిన నగర ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు అందించిన ఈ గొప్ప ఆశీర్వాదమే స్ఫూర్తిగా రానున్న రోజుల్లో నగర అభివృద్ధి కోసం మరింత వేగవంతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ చారిత్రాత్మక విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించిన కూటమి నాయకులు, కార్యకర్తల పాత్ర ఎనలేనిదని, ఎన్నికలు మొదలైన నాటి నుంచి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రతి ఇంటినీ పలకరించి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినందుకే ఈ ఫలితం దక్కిందని, అందుకే ఈ విజయాన్ని పూర్తిగా కార్యకర్తలకే అంకితం చేస్తున్నానని స్పష్టం చేశారు. అలాగే విజయం సాధించిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, కూటమి నాయకత్వంలో గెలిచిన వారంతా తమ తమ వార్డులను స్ఫూర్తిదాయకంగా అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు.
ముఖ్యంగా ఈ విజయంలో అత్యంత అధిక ప్రాధాన్యత కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కే దక్కుతుందని, ఆయన క్షేత్రస్థాయిలో అందిస్తున్న అభివృద్ధి, కేంద్రం నుంచి తీసుకువస్తున్న నిధులను ప్రజలు నిశితంగా గమనించారని, ఆయనకు అండగా స్థానికంగా తాము చేస్తున్న పనులను కూడా గుర్తించి ప్రజలు ఈ తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలు అందించిన ఈ స్ఫూర్తితోనే నగరాన్ని, పశ్చిమ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.




