Guntur: వెంగళరావునగర్ గర్ల్స్ హైస్కూల్‌ను తనిఖీ చేసిన ఎంఈఓ ఖుద్దూస్

Guntur: గుంటూరు వెంగళరావునగర్ గర్ల్స్ హైస్కూల్‌లో ఎంఈఓ ఖుద్దూస్ తనిఖీలు; నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలని హెచ్చరిక.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 20 Nov 2026 7:43 PM IST
Guntur
X

Guntur: వెంగళరావునగర్ గర్ల్స్ హైస్కూల్‌ను తనిఖీ చేసిన ఎంఈఓ ఖుద్దూస్

గుంటూరు: గుంటూరు నగరంలోని 71వ వార్డు, తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న వెంగళరావునగర్ గర్ల్స్ హైస్కూల్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంపై గుంటూరు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, ఇతర సౌకర్యాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ MEO ఖుద్దూస్ పాఠశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించారు.

పాఠశాలలో విద్యాబోధన తీరును, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజనంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

పిల్లలకు పరిశుభ్రమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థులను ఎవరైనా వేధించినా, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అలాంటి విషయాలు తన దృష్టికి వస్తే బాధ్యులైన ఉపాధ్యాయులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని MEO ఖుద్దూస్ హెచ్చరించారు.

విద్యార్థుల భవిష్యత్తు, వారి ఆరోగ్యం, నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ పాఠశాల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన భోజనం అందించడమే లక్ష్యంగా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN