Guntur: పెమ్మసాని, గల్లా మాధవి ప్రచారానికి జనం నీరాజనం!

Guntur: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కేంద్రమంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ రోడ్‌షోకు విశేష స్పందన. కూటమి ఘన విజయం ధీమా.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Oct 2026 9:42 PM IST
Guntur
X

Guntur: పెమ్మసాని, గల్లా మాధవి ప్రచారానికి జనం నీరాజనం!

గుంటూరు: గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, స్థానిక టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రచార మార్గమంతా సందడిగా మారింది.

58, 59, 60, 61, 42వ డివిజన్ల పరిధిలో సాగిన ఈ రోడ్‌షో కోరిటిపాడు గాంధీ బొమ్మల సెంటర్‌ నుంచి ప్రారంభమైంది. కోరిటిపాడు లైబ్రరీ సెంటర్‌ మీదుగా చైతన్యపురి మెయిన్‌ రోడ్డు, ముత్యాలరెడ్డి నగర్‌ మెయిన్‌ రోడ్డు, వేలంగిని నగర్‌ ఆర్చి, అమరావతి రోడ్డు, అమరావతి మెయిన్‌ రోడ్డులోని ఆల హాస్పిటల్‌ మీదుగా కొనసాగింది. అనంతరం పీఎస్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డు, చంద్రయ్య నగర్‌ సెంటర్‌ మీదుగా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం చేరుకుని, అక్కడి నుంచి అరండల్‌పేట ఐదో లైన్‌ లైబ్రరీ సెంటర్‌ వరకు రోడ్‌షో ఉత్సాహంగా సాగింది.

రోడ్‌షోలో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని తమ అభిమానాన్ని, మద్దతును వ్యక్తం చేశారు. మహిళలు, యువత, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రచార కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. కార్పొరేటర్ అభ్యర్థులు, స్థానిక టీడీపీ నాయకులు, కూటమి కార్యకర్తలు సమన్వయంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలను కలుసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రోడ్‌షోలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు జనసేన నాయకులు కిలారి రోశయ్య, మాదాల చైతన్య, వివిధ డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, స్థానిక టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN