Guntur: ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు
Guntur: గుంటూరులో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్及 ఇతర నేతలు నివాళులర్పించారు.
Guntur: ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు
గుంటూరు: భారత దేశ సమగ్రత కోసం, లౌకిక దృక్పథం అమలు కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీజీ చిరస్మరణీయులని వారి అడుగుజాడల్లో భారత్ పయనిస్తేనే విశ్వ గురువుగా మారుతుందని మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.
ఈనెల 2వ తేదీన మహాత్మా గాంధీజీ 157 వ జయంతి సందర్భంగా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ వద్ద గల మహాత్మా గాంధీజీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
డొక్కా మాణిక్యరావు ప్రసాద్ ప్రసంగిస్తూ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీజీ ప్రజలందరినీ ఏకత్రాటిపై నిలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడితే నేటి పాలకులు ప్రజలను కులాల వారీగా, మతాల వారీగా చీలిస్తూ ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతూ సమాజాన్ని విడదీస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలగడానికి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని అది సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టు నేతృత్వంలో నే భవిష్యత్ లో జరిగే ఎన్నికలను నిర్వహించాలని కోరారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ నేటి పాలకులు గాంధీజీ ఆశయాలకు తిలోదకాలు ఇస్తున్నారని తెలిపారు. మద్యం అమ్మకాలను పెంచుతూ ప్రభుత్వాలు ఆదాయాలను పొందాలనుకోవడం మహా పాపమని గాంధీజీ పేర్కొంటే నేటి పాలకులు మద్యం అమ్మకాలను ఆదాయ వనరులుగా మార్చినారన్నారు.
గాంధీజీ పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తే నేటి పాలకులు భారతదేశాన్ని పర్యావరణ సూచికలో 176వ స్థానానికి ఇండియాను చేర్చారన్నారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూధర్ కింగ్, ఐన్ స్టీన్ లాంటి మహనీయులు గాంధీజీని అనుసరిస్తే నేటి పాలకులు గాంధీజీ పై విష ప్రచారం చేస్తున్నారన్నారు .
గాంధీజీ 1915లో గోపాలకృష్ణ గోఖలే స్ఫూర్తితో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరి ప్రజా ఉద్యమంగా మార్చి 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో దండియాత్ర, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలను భాగస్వామ్యం చేసి సత్యం, అహింస ఆయుధాలుగా ఉద్యమించినారన్నారు .
టిటిడి బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీజీ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అతి పేదలను స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములు చేసి ఉద్యమించిన మహనీయుడని కొనియాడారు. అంటరాని వారిని దేవాలయాల్లోకి ప్రవేశింప చేయడం, ప్రజలలో మత సమరస్యాన్ని పెంపొందిస్తూ ఉద్యమించిన బాపూజీ అందరవాడిగా ప్రపంచ నాయకునిగా ఎదిగినారన్నారు.
సత్యం కోసం నిలిచిన మహాత్ముడు, అహింసతో పోరాడిన యోధుడు,శాంతి కోసం ప్రపంచానికి మార్గం చూపిన మహనీయుడు మహాత్మా గాంధీజీ సేవలను గుర్తించి ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించి అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మానవత అధ్యక్షులు పోలూరి వీరారెడ్డి, మాదిగ జన సేవా సమితి నాయకులు దాసరి జాన్ బాబు, పరంగి సత్యరాజ్, ఏపీపీ సునీల్, వినుకొండ నవీన్, కాపు రాష్ట్ర నాయకులు మాదా రాధా, పాలకయాల వెంకట్, బీసీ నాయకులు కొణిదె గోపి కృష్ణ, మస్తాన్ వలి, దళిత నాయకులు మండాది సుబ్బారావు, బత్తుల కోటేశ్వరరావు, సముద్రాల కోటేశ్వరరావు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత ద్వితీయ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 122వ జయంతిని పురస్కరించుకుని నివాళులు తెలిపారు.




