Guntur: గుంటూరులో ఘనంగా కాపు ఆత్మీయ కార్తీక వనసమారాధన వేడుకలు
Guntur: గుంటూరు గోర్లవారిపాలెంలో డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో కాపు కార్తీక వనసమారాధన జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ, సుబ్బారాయుడు హాజరు. ఐకమత్యంపై పిలుపు.
Guntur: గుంటూరులో ఘనంగా కాపు ఆత్మీయ కార్తీక వనసమారాధన వేడుకలు
గుంటూరు: గుంటూరు నగరంలోని గోర్లవారిపాలెంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్, 7 హిల్స్ ఫార్మసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో కాపు ఆత్మీయ కార్తీక వనసమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా, ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి కాపు సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్, 7 హిల్స్ ఫార్మసీ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ...
కాపు సామాజిక వర్గంలోని ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పర ఆత్మీయతను పంచుకోవడంతో పాటు మన మధ్య ఉన్న అనుబంధాలను మరింత బలోపేతం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మనమంతా వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు వృత్తుల్లో ఉన్నప్పటికీ మనందరిలో ఉండాల్సింది ఒకే భావన, ఒకే ఐకమత్యమని అన్నారు.
కాపు సామాజిక వర్గ అభివృద్ధి అనేది ఒక్క నాయకుడితోనో, ఒక్క సంస్థతోనో సాధ్యమయ్యేది కాదని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, సహకారం, సమష్టి కృషితోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మన సమాజంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు విద్యార్థుల చదువులు, యువత ఉపాధి, వ్యాపార అవకాశాలు, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
మనలో ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని, అలాంటి వారు తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, ఆర్థిక స్థోమతను అవసరంలో ఉన్న మరొకరికి ఉపయోగపడేలా అందించాలని సూచించారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందితే ఒక కుటుంబం బాగుపడుతుంది, అదే సమాజంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందితే మొత్తం సామాజిక వర్గం బలోపేతం అవుతుందని అన్నారు.
మన మధ్య చిన్నచిన్న విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి సమాజ ప్రయోజనాల కోసం అందరం ఒక్కటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పదవులు, హోదాలు, రాజకీయాలకు అతీతంగా కాపు సోదరులందరూ ఒకరికొకరు అండగా నిలవాలని, ఎవరికి ఏ అవసరం వచ్చినా మనమంతా ఒక కుటుంబంలా స్పందించాలని ఆకాంక్షించారు.
ఈ ఆత్మీయ సమ్మేళనం కేవలం ఒక వనసమారాధన కార్యక్రమంగా మిగిలిపోకూడదని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాల ద్వారా సమాజంలోని సమస్యలను చర్చించుకుని, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతి కోసం తన వంతు సహాయ సహకారాలు, కృషి ఎల్లప్పుడూ కొనసాగిస్తానని డేగల ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...
కాపు సోదరులందరూ ఐకమత్యంతో ఉంటూ సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కుటుంబాల మధ్య, సమాజంలోని వ్యక్తుల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తాయని అన్నారు. యువతకు విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ...
కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన ఎంతో కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అవకాశాలు అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాపు సోదరులంతా పరస్పర సహకారంతో సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...
కాపు సోదరుల మధ్య ఐకమత్యం, ఆత్మీయత మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ కష్టసమయాల్లో పరస్పరం సహాయం చేసుకోవాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజిక బంధాలను బలోపేతం చేస్తాయని తెలిపారు.
కాపు నాయకులు చందు జనార్దన్, చందు సాంబశివరావు మాట్లాడుతూ...
కాపు సామాజిక వర్గంలో ఐక్యతతో పాటు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. సమాజంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కిలారి రోశయ్య , ఉగ్గిరాల సీతారామయ్య మాట్లాడుతూ...
కాపు సోదరులందరూ వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా సామాజిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. యువతకు మార్గదర్శకత్వం అందిస్తూ భవిష్యత్తు తరాలకు మంచి అవకాశాలు కల్పించేందుకు నాయకులందరూ ముందుకు రావాలని సూచించారు. ఐకమత్యంతో చేసే ప్రయత్నాలే సమాజ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, కాపు నాయకులు చందు జనార్దన్, చందు సాంబశివరావు,కిలారి రోశయ్య, వడ్రానం హరిబాబు,ఉగ్గిరాల సీతారామయ్య, గుంటూరు నగరపాలక సంస్థ కూటమి కాపు కార్పొరేటర్లు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను చైర్మన్ డేగల ప్రభాకర్ ఘనంగా శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
కార్యక్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ డేగల ప్రభాకర్ మరియు కాపు ఆత్మీయ కార్తీక వన సమారాధన కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్తీక మాసంలో నిర్వహించిన ఈ వనసమారాధన కాపు సోదరుల ఆత్మీయతకు, ఐకమత్యానికి, సామాజిక బంధాలకు ప్రతీకగా నిలిచింది.




