Guntur: జీఎంసీలో బాణాసంచా అనుమతులు: కమిషనర్ మయూర్ అశోక్!
Guntur: గుంటూరులో దీపావళి బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు జీఎంసీ సింగిల్ విండో ద్వారా అనుమతులు తీసుకోవాలని కమిషనర్ కే. మయూర్ అశోక్ స్పష్టం చేశారు.
Guntur: జీఎంసీలో బాణాసంచా అనుమతులు: కమిషనర్ మయూర్ అశోక్!
గుంటూరు: గుంటూరు నగరంలో దీపావళి బాణాసంచా వ్యాపారం నిర్వహించు వ్యాపారస్తులు తప్పనిసరిగా నగర పాలక సంస్థలో ఏర్పాటు చేసిన సింగల్ విండో కౌంటర్ నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా నగరంలో ప్రమాద రహితంగా బాణాసంచా షాపులను ఏర్పాటు చేసుకోవడానికి గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగం నందు ఏర్పాటు చేసిన సింగిల్ విండో కౌంటర్ లో వ్యాపారస్తులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అనుమతించిన నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే తాత్కాలిక బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేయాలన్నారు. బాణాసంచా షాపును ఏర్పాటు చేయుటకు దరఖాస్తు దారుని ఫోటోతో అప్లికేషన్, అగ్నిమాపక శాఖ నుండి ఎన్ఓసి, ట్రాఫిక్ పోలీస్ అనుమతి, ఫీల్డ్ వెరిఫికేషన్ టీం అనుమతి పత్రం, జిఎస్టీ చెల్లించిన రశీదు, స్థల యజమాని అంగీకార పత్రం, ప్రాపర్టీ టాక్స్ రిసిప్ట్, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్, రెవెన్యూ అనుమతి పత్రాలను జత చేస్తూ, జిఎంసిలోని సింగిల్ విండో కౌంటర్ లో దరఖాస్తు చేయాలని, వాటిని పరిశీలించి, వెంటనే అనుమతి మంజూరు చేస్తామని తెలిపారు.
షాపులు ఏర్పాటు చేయుటకు వ్యాపారస్తుల నుండి ఇప్పటికి వరకు 35 దరఖాస్తులు అందాయని, సదరు దరఖాస్తులను ఫీల్డ్ వెరిఫికేషన్ టీం తనిఖీ చేసిన అనంతరం అనుమతులు మంజూరు చేయుట జరుగుతుందన్నారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాలలో గానీ, ముందస్తు అనుమతి లేకుంఢా గానీ అనధికారికంగా షాపులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రతి దుకాణం వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగినంత నీరు, ఇసుక బకెట్లు మరియు అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని తెలియచేశారు. బాణాసంచా విక్రయ కేంద్రాల వద్ద కొనుగోలుదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వ్యాపారస్తులందరూ అధికారుల సూచనలను పాటిస్తూ, సురక్షితమైన పద్ధతుల్లో వ్యాపారాలు నిర్వహించి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి సహకరించాలన్నారు.




