Guntur: గుంటూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం కమిషనర్

Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు ఏఎన్‌యూ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి. 468 టేబుళ్లు, 1,404 మంది సిబ్బంది నియామకం: కమిషనర్ మయూర్ అశోక్.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 2 Nov 2026 7:34 PM IST
Guntur
X

Guntur: గుంటూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం కమిషనర్

గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. ఓట్ల లెక్కింపుకు 50 హాల్స్ లో 468 టేబుల్స్ ఏర్పాటు ఓట్ల లెక్కింపుకి 1404 మంది సిబ్బంది నియామకం లెక్కింపు కేంద్రంలో బందోబస్త్ లో భాగంగా లోనికి మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపు వేగంగా జరగడానికి సహకరించాలని కోరిన కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ మయూర్ అశోక్.

ఈనెల 3వ తేదీన (మంగళవారం) గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా మరియు అత్యంత సజావుగా పూర్తి చేయడానికి నగర పాలక సంస్థ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు.

సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కాలేజీ నిర్దేశిత బ్లాకులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి, సదరు ప్రాంతంలో జరుగుతున్న కౌంటింగ్ సిబ్బంది శిక్షణలో జిల్లా ఎన్నికల పరిశీలకులు వి.వీర బ్రహ్మయ్యతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని మొత్తం 76 వార్డుల పరిధిలో ఉన్న 596 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను సకాలంలో లెక్కించేందుకు గాను విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఇందుకోసం 468 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేయగా, ఈ బాధ్యతలను నిర్వహించడానికి 1,404 మంది శిక్షణ పొందిన సిబ్బందిని మరియు అధికారులను విధుల్లో నియమించామని తెలిపారు.

పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి తరఫున నియమించబడిన అధికారిక ప్రతినిధులు 3వ తేదీ ఉదయం 6 గంటల సమయానికి స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు మరియు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల సీల్స్ తెరిచి లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, కేంద్రాల లోపలికి ఎలాంటి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతినిధులు, సిబ్బంది తమ సెల్ ఫోన్లను భద్రపరుచుకోవడానికి వీలుగా బయట ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు సౌకర్యార్థం తాగునీరు, అల్పాహారం, భోజన వసతులతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళికి లోబడి, లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కోరారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN