Guntur: గుంటూరులో దోమల నివారణకు డ్రోన్లతో యాంటీ లార్వల్ డ్రైవ్

Guntur: మలేరియా, డెంగ్యూ నివారణకు గుంటూరులో జీఎంసీ ప్రత్యేక డ్రైవ్; చెరువులు, కాల్వల్లో డ్రోన్ ఆధారిత యాంటీ లార్వల్ ఆపరేషన్లు, కల్వర్ట్ ఫాగింగ్ చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 27 Nov 2026 9:42 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో దోమల నివారణకు డ్రోన్లతో యాంటీ లార్వల్ డ్రైవ్

గుంటూరు: దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధుల నివారణకు గుంటూరు నగరపాలక సంస్థ మలేరియా ఆధ్వర్యంలో ప్రత్యేక నియంత్రణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.

కమిషనర్ ఆదేశాల మేరకు బయాలజిస్ట్ శేషయ్య ఆధ్వర్యంలో శుక్రవారం మలేరియా సిబ్బంది వార్డ్ ల వారీగా వర్షాల వలన ఏర్పడిన నీటి నిల్వలు, డ్రైనేజీలు, కాలువలు, కల్వర్టులు, ఖాళీ స్థలాలు, ఇతర దోమల ఆవాసాలను గుర్తించి నిర్మూలించేందుకు సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, దోమల నివారణకు ప్రధానంగా యాంటీ లార్వల్ ఆపరేషన్లు నిర్వహించి దోమల లార్వా దశలోనే నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటి నిల్వ ప్రాంతాలు, మురుగు కాలువలు, డ్రైనేజీలు, నిర్మాణ ప్రదేశాలు, ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వలను పరిశీలించి తగిన లార్వా నిర్మూలన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలోని చెరువులు, పెద్ద ఖాళీ స్థలాలు, కాల్వల్లో డ్రోన్ ఆధారిత యాంటీ లార్వల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు.

డ్రోన్ ద్వారా లార్వా నిర్మూలన చర్యలను చేపట్టడం వల్ల విస్తృత ప్రాంతాలను వేగంగా కవర్ చేయడంతో పాటు సిబ్బంది చేరుకోలేని ప్రదేశాల్లో కూడా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు వీలవుతుందన్నారు. అదేవిధంగా దోమల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, రోడ్లు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, కాలనీలు, ఇతర ప్రజాసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేకంగా కల్వర్టులు, డ్రైనేజీ మార్గాలు, చీకటి మరియు తేమతో కూడిన ప్రాంతాల్లో దోమల ఆశ్రయాలు ఏర్పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కల్వర్ట్ ఫాగింగ్ కూడా ప్రత్యేకంగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ కంటైనర్లు, పూల కుండీలు మరియు ఇతర నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి శుభ్రం చేయాలని, దోమతెరలను వినియోగించాలని, జ్వరం వచ్చిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN