Guntur: కూటమితోనే గుంటూరు అభివృద్ధి పరుగులు: పెమ్మసాని!
Guntur: గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు.
Guntur: కూటమితోనే గుంటూరు అభివృద్ధి పరుగులు: పెమ్మసాని!
గుంటూరు: గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పశ్చిమ నియోజకవర్గంలోని 1, 2, 75, 76 డివిజన్లలో కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు.
కోవెలమూడి లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని, నగరంలో మరింత అభివృద్ధి జరగాలంటే తమ అమూల్యమైన ఓటుతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ అండగా నిలుస్తామని తెలిపారు.
కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ డివిజన్ల పరిధిలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, వచ్చే మూడేళ్లలో ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నందివెలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను త్వరలో పూర్తి చేస్తామని, గుంటూరు జీజీహెచ్లో క్యాన్సర్ వైద్య సేవలను బలోపేతం చేస్తామని వివరించారు. చెట్లు నాటేవారెవరో, చెట్లు నరికేవారెవరో గుర్తించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నగర అభివృద్ధి కొనసాగేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బీఆర్ స్టేడియాన్ని రూ.14 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని, రూ.2 కోట్లతో పలు డ్రైనేజీ పనులు చేపడుతున్నామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. నగరంలో అభివృద్ధి పనులు మరింత ముందుకు సాగేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.




