Guntur: కోర్టు కేసులను ప్రతిరోజూ సమీక్షించాలి
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ కోర్టు కేసులపై కమిషనర్ కె.మయూర్ అశోక్ సమీక్ష; గడువులోగా కౌంటర్లు దాఖలు చేసి, కంటెమ్ట్ కేసులు కాకుండా చూడాలని ఆదేశం.
Guntur: కోర్టు కేసులను ప్రతిరోజూ సమీక్షించాలి
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించిన కోర్టు కేసుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విభాగాధిపతి తమ పరిధిలోని కోర్టు కేసులను ప్రతిరోజూ తప్పనిసరిగా సమీక్షించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థలోని కమిషనర్ చాంబర్ నందు నగర పాలక సంస్థ విభాగాధిపతులు, సూపరింమ్డెంట్లతో విభాగాల వారీగా ఉన్న కోర్ట్ కేసులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థకు సంబంధించిన వివిధ అంశాలపై న్యాయస్థానాల్లో దాఖలవుతున్న కేసుల్లో నిర్ణీత సమయంలో కౌంటర్లు దాఖలు చేయడం అత్యంత ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్లు పెండింగ్లో ఉండకూడదని, న్యాయస్థానాలు నిర్దేశించిన గడువులోగా సంబంధిత విభాగాల అధికారులు అవసరమైన సమాచారాన్ని, రికార్డులను సేకరించి లీగల్ సెల్ విభాగానికి అందజేయాలని సూచించారు.
కోర్టు కేసుల విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రతిరోజూ సమీక్షించి, సకాలంలో కౌంటర్ల దాఖలు, కోర్టు ఉత్తర్వులను పాటించి కంటేమ్ట్ కేసులు కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేకించి గుంటూరు నగరపాలక సంస్థలో అత్యధిక సంఖ్యలో కోర్టు కేసులు దాఖలవుతున్న టౌన్ ప్లానింగ్ విభాగంలో కోర్టు కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించుకోవాలన్నారు.
ప్రతి కేసుకు సంబంధించిన న్యాయస్థానం పేరు, కేసు నంబర్, కేసు దాఖలైన తేదీ, కేసు స్వభావం, తదుపరి విచారణ తేదీ, కౌంటర్ దాఖలు స్థితి తదితర వివరాలతో సమగ్ర రికార్డును నిర్వహించాలన్నారు. ప్రతి విభాగాధిపతి తమ పరిధిలోని కేసులపై ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి, కౌంటర్లు దాఖలు చేయాల్సిన కేసులు, కోర్టు ఆదేశాల అమలు, తదుపరి విచారణకు సిద్ధం చేయాల్సిన రికార్డులు వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ.కిషోర్, రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, మేనేజర్ బాలాజీ బాష, వివిధ విభాగాల సూపరిండెంట్లు పాల్గొన్నారు.




