Guntur: అర్నాబ్ తుఫాన్ వేళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు!
Guntur: గుంటూరు నగరంలో అర్నాబ్ తుఫాన్ వేళ నీరు నిలవకుండా కమిషనర్ మయూర్ అశోక్ చర్యలు. క్షేత్రస్థాయి పర్యటన, GMC కాల్ సెంటర్ 0863 2345103 ఏర్పాటు.
Guntur: అర్నాబ్ తుఫాన్ వేళ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు!
గుంటూరు: గుంటూరు నగరంలో 'అర్నబ్' తుఫాన్ నేపథ్యంలో, ఎక్కడా వర్షంనీరు నిలవకుండా మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం పూర్తి స్థాయి సన్నాహకాల్లో ఉందని, ప్రజలు ఏ సమస్య ఎదురైనా జిఎంసి కాల్ సెంటర్ 0863 2345103 కి కాల్ చేయవచ్చని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.
బుధవారం కమిషనర్ నగరంలోని వర్షపు నీరు ఎక్కువగా నిలిచే చుట్ట గుంట మురికిపేట, పీకల వాగు, కంకరగుంట ఆర్యూబీ, టిజేపీఎస్ కాలేజి ఎదురు, ఐటీసీ రోడ్డు, జేకేసి కాలేజ్ రోడ్, పట్టాభిపురం మెయిన్ రోడ్, అమరావతి రోడ్, 3 వంతెనలు, రామిరెడ్డితోట, గుంటూరువారితోట, పాత గుంటూరు, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలోని ప్రధాన డ్రెయిన్లు, నాలాల్లో ఎక్కడా అడ్డంకులు (బ్లాకేజెస్) కూడా లేకుండా తక్షణమే ప్రవాహాన్ని సుగమం చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైన తగినంత మంది పారిశుధ్య సిబ్బందిని, నాలా యంత్రాలను మరియు జేసీబీలను అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా, వ్యర్థ పదార్థాలు పేరుకుపోయిన ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు.
ముఖ్యంగా వార్డు శానిటేషన్ సెక్రటరీలు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు తమ పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ సాగించాలని, ఎక్కడా డ్రైనేజీలు పొంగిపొర్లే పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించేలా యంత్రాంగం సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వర్షాల వలన ఎదురైనా సమస్యల శాశ్వత పరిష్కారానికి వార్డ్ ల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణ ప్రణాళిక అధికారులు కూడా తమ పరిధిలో శిదిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి, అందులో ఎవరైనా ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, భారీ హోర్డింగ్స్ కి ఉన్న బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు.




