Guntur: జీజీహెచ్‌లో అరుదైన వైద్యం.. చిన్నారికి విజయవంతంగా ఎండోస్కోపీ!

Guntur: జీజీహెచ్‌లో నాలుగేళ్ల చిన్నారికి విజయవంతంగా ఎండోస్కోపీ ద్వారా పాలిపెక్టమీ శస్త్రచికిత్స. ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చులు భరించలేక జీజీహెచ్‌ను ఆశ్రయించిన పేద తల్లిదండ్రులు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 11 Oct 2026 11:58 AM IST
Guntur
X

Guntur: జీజీహెచ్‌లో అరుదైన వైద్యం.. చిన్నారికి విజయవంతంగా ఎండోస్కోపీ!

Guntur: నాలుగేళ్ల చిన్నారికి అనారోగ్య సమస్య తలెత్తడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మల విసర్జన సమయంలో రక్తస్రావం, మలద్వారం నుంచి గడ్డ బయటకు రావడంతో చిన్నారిని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు అధిక ఖర్చులు అవుతాయని తెలియడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ను ఆశ్రయించారు. అక్కడి గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు భరోసా కల్పించి, శస్త్రచికిత్సకు బదులుగా ఎండోస్కోపీ విధానంలో పాలిప్‌ను విజయవంతంగా తొలగించారు. చిన్నారికి ఉపశమనం కలగడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

గుంటూరులోని వేలాంగి నగర్‌కు చెందిన ప్రశీ కృతిక (4) అనే చిన్నారి సెప్టెంబర్ 25న జీజీహెచ్‌లో చేరింది. చిన్నారికి నిర్వహించిన కొలనోస్కోపీ పరీక్షలో రెక్టోసిగ్మాయిడ్ జంక్షన్ వద్ద సుమారు 2×2 సెంటీమీటర్ల పరిమాణంలో పాలిప్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సెప్టెంబర్ 30న చికిత్స చేపట్టారు.

జనరల్ అనస్థీషియా కింద ఎండోస్కోపీ మార్గదర్శకత్వంలో పాలీపెక్టమీ నిర్వహించారు. హాట్ స్నేర్ పద్ధతిలో పాలిప్‌ను తొలగించి, రక్తస్రావం జరగకుండా దాని అడుగు భాగంలో హెమోక్లిప్ అమర్చారు. చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఒక రోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన మందులు అందించి డిశ్చార్జి చేశారు.

తొలగించిన పాలిప్‌ను హిస్టోపాథలాజికల్ పరీక్ష కు పంపించగా, నివేదిక రావాల్సి ఉందని ఈ వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ కవిత, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగూర్ బాషా, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్, పీజీ వైద్యులు డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ శివరామ గోపాల్, డాక్టర్ శ్రీతేజ్ చికిత్సలో పాల్గొన్నట్లు తెలిపారు. చిన్నారికి వైద్య సేవలు అందించిన బృందాన్ని ఆయన అభినందించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుర్గాప్రసాద్ సూచించారు. ప్రైవేట్ వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందే నాణ్యమైన చికిత్స ఎంతో ఊరటనిస్తుందన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN